NTV Telugu Site icon

Chandrababu Naidu: నా ప్రాణాలు అడ్డుపెట్టైనా పార్టీ కోసం పనిచేసేవారిని కాపాడుకుంటా..

Chandrababu Naidu

Chandrababu Naidu

పార్టీ కోసం పని చేసేవారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కందుకూరు బహిరంగ సభలో జరిగిన దురదృష్టకరమైన ఘటనపై స్పందిస్తూ.. కందుకూరు సభకు వేలాది మంది ప్రజలు వచ్చారు.. కానీ, మాజీ ముఖ్యమంత్రిగా నేను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదు.. పోలీసులు ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు.. అందుకే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు.. కందుకూరులో నేను సభ పెట్టిన ప్రాంతంలో గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, వైఎస్ జగన్, సినీ నటులు కూడా బహిరంగ సభలు పెట్టారని గుర్తుచేశారు.. అయితే, ప్రమాదానికి ముందే పోలీసులను హెచ్చరించినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Read Also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో జనవరిలో విశేష పర్వదినాలు ఇవే..

మరోవైపు, కందుకూరులో మృతులకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించామని గుర్తుచేశారు చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తర్వాత రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారని విమర్శించారు.. 8 మంది టీడీపీ కార్యకర్తల్ని కోల్పోయి బాధలో ఉంటే.. పుండుమీద కారం చల్లినట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. పార్టీ కోసం పని చేసే వారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని వెల్లడించారు.. ఇక, హుదూద్ తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేశామని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.. 10 రోజులు విశాఖలోనే ఉండి బాధ్యతగా పనిచేశానన్న ఆయన.. రాజేశ్వరి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 28వ తేదీన నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకున్న విషయం విదితమే.. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

Show comments