ఏపీలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. గడచిన స్థానిక ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ అరాచకాలు చేశారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చాలా చోట్ల అభ్యర్థులని బెదిరించి విత్ డ్రా చేయించారన్న ఆయన.. పోలీసులే ఎన్నికల్లో సెటిల్మెంట్లు చేస్తూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. నామినేషన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు మేం ఎప్పుడూ తీసుకోలేదని గుర్తుచేసుకున్న టీడీపీ అధినేత.. పోటీ చేయాలనుకునే అభ్యర్థికి సహకరించాల్సిన బాధ్యత ఆర్వోపై ఉందన్నారు. కానీ, ఎన్నికల అధికారులే దగ్గరుండి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
Read Also: కేసీఆర్‌కు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే.. సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ గొడవలు లేవు.. ఇలాంటి ప్రశాంతమైన నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా రౌడీయిజం చేశారని ఫైర్ అయ్యారు చంద్రబాబు.. 14వ వార్డుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. స్క్రూట్నీలో అంతా బాగుందని చెప్పి.. ఆ తర్వాత ప్రకటించిన తుది జాబితాలో టీడీపీ అభ్యర్థుల పేర్లు తొలగించారని.. కుప్పం 14వ వార్డులో నామినేషన్ వేసిన వారు డాక్యుమెంట్లను కలెక్టరుకు కూడా పంపామన్నారు. మరోవైపు, నెల్లూరులో తప్పుడు సంతకాలతో విత్ డ్రా చేసేస్తారా..? తప్పుడు పనులు చేస్తున్న అధికారులకు సిగ్గుందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డిని చొక్కా చిరేగేలా ఈడ్చుకుపోతారా..? తప్పులు చేసి తిరిగి మా నేతలపై కేసులు పెడతారా..? అని ప్రశ్నించిన ఆయన.. కుప్పంలో టీడీపీ నేతలెవరూ లేకుంటే రిగ్గింగ్ చేద్దామనుకుంటున్నారు అని విమర్శించారు.. అధికారుల ఫిర్యాదులో టీడీపీ నేతలు తనపై చేయి చేసుకున్నారనే విషయాన్ని ప్రస్తావించకున్నా.. డీఎస్పీ చేయి చేసుకున్నారని ప్రకటనలు ఇచ్చేస్తున్నారని.. ఇంత వరకు నా మంచి తనాన్నే చూశారు.. తప్పులు చేసిన అధికారులను వదిలేదే లేదు అని హెచ్చరించారు.. నెల్లూరులోనూ అదే తరహాలో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.. బీ-ఫారం తీసుకుని పార్టీ మారారట.. పార్టీ మారాలనుకుంటే ముందే మారేవారుగా..? అని ప్రశ్నించారు.. ఒత్తిడి, ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్పించుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇలాంటి గెలపూ ఓ గెలుపేనా..? సిగ్గు లేదా..? ప్రజలు తిరగబడితే కుక్కను కొట్టినట్టు కొడతారా? పరిపాలించడం చేతకాకుంటే వదిలి పెట్టి పోండి.. కానీ, అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని తగులబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
