Site icon NTV Telugu

Movie Tickets: ఇంత అవమానమా..? చిరంజీవి చేతులు జోడించి వేడుకోవాలా..?

సినిమా టికెట్ల ధరలు, షోలు, ఇతర సినీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో ఇటీవలే తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే.. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌. నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి సమావేశమై.. సీఎంతో చర్చించడం.. ఆ తర్వాత ప్రశంసలు కురిపించడం జరిగిపోయాయి.. అయితే, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలుగు సినీ రంగ హీరోలను, ప్రముఖులను మీటింగ్ పేరుతో పిలిపించి సీఎం జగన్ అవమానించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా పరిశ్రమను జగన్ తన వైఖరితో కించపరిచారన్నారు. లేని సమస్యను సృష్టించి సినిమా రంగాన్ని కించపరిచేలా జగన్ వ్యవహరించారని విమర్శించారు. స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి వంటి వారు సిఎంకు చేతులు జోడించి వేడుకోవాలా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Road Safety: కీలక నిర్ణయాలు

మరోవైపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యుద్ధం చేయకుండా పలాయనవాదం ఎందుకని సీఎం జగన్‌ను నిలదీశారు చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ చేసిన నాటి సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేక హోదా అంశం తమ ఘనతగా చెప్పుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు టీడీపీపై బురద చల్లడం విడ్డూరమని మండిపడ్డారు.. రాష్ట్ర ఆదాయం తగ్గకపోయినా ఆర్థిక వ్యవస్థను మాత్రం పూర్తిగా నాశనం చేశారని విమర్శలు గుప్పించిన ఆయన.. ఈశాన్య రాష్ట్రాల కంటే దారుణంగా ఏపీని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version