టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై నిలదీస్తున్నందుకే.. ప్రభుత్వం కక్ష గట్టి అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. అసలు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని… సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ చేస్తున్న ప్రతి తప్పుకు త్వరలోనే మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.
అటు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. తప్పుడు ధ్రువపత్రం అందించారని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరఫున పోరాటం చేస్తున్నందుకే అశోక్‌బాబుపై జగన్ సర్కారు కక్ష సాధిస్తుందని లోకేష్ విమర్శలు చేశారు. ఇది కోర్టులో నిలబడే కేసు కాదని.. తాము అక్కడే పోరాడి తేల్చుకుంటామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ స్పష్టం చేశారు.