NTV Telugu Site icon

Chandra Babu: నాలుగంటే నాలుగే.. ఇదేనా జగన్ సర్కార్ వరద సాయం?

Chandrababu

Chandrababu

Tdp cheif chandrababu comments on helping to Flood victims: గోదావరి నదికి వచ్చిన వరద ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ వరద కారణంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రీతిలో సెటైర్లు వేశారు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగంటే నాలుగే.. ఇది జగన్ సర్కార్ వరద సాయం అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.

కాగా ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేస్తే సరిపోతుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే జగన్‌ తన కాలికి బురద అంటకుండా హెలికాఫ్టర్‌లో తిరుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల వరద ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.

Read Also: Pawan Kalyan: బటన్ నొక్కితే సరిపోదు.. మానవత్వంతో స్పందించాలి

మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు కూడా ఆరోపణలు చేశారు. గోదావరి వరదల్లో చిక్కుకున్నవారికి సాయం అందించలేకే ప్రభుత్వం పోలవరం ఎత్తు అంశంపై డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే పోలవరం ఎత్తుపై తెలంగాణ మిత్రులతో కలిసి కొత్త ఏపీ మంత్రులు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. టీడీపీ హయాంలో లేని పోలవరం ఎత్తుపై రగడ జగన్ ప్రభుత్వంలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ఎత్తుపై కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కనీసం స్పందించని ఏపీ మంత్రులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని నిలదీశారు. కేంద్ర జలశక్తి పరిధిలో అంశాలపై ఏపీ, తెలంగాణ నేతలు స్పందించడానికి కారణం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే అని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.