chandrababu comments on ap government on polavaram merging villages: ఏపీలో కొత్త వివాదం నెలకొంది. పోలవరం ముంపు మండలాలలోని ఐదు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని ఆందోళనలకు దిగారు. తమను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. తమ గ్రామాలను తెలంగాణలో కలిపితే తమకు అక్కడి ప్రభుత్వం అండ దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ అంశంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద నమ్మకం లేకపోవడం వల్లే విలీన మండలాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని ఆందోళనలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విలీన మండలాల్లో విద్యుత్ సరఫరా లేక, తాగడానికి నీరు లేక ప్రజలు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. వరదల్లో వచ్చిన బురదను, రహదారుల్లో కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదని చంద్రబాబు ఆరోపించారు.
Read Also: PM Narandra Modi: టార్గెట్ 2024.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ
వారం క్రితమే వరదలు తగ్గాయని మంత్రులు ప్రకటనలు చేసినా ఇంకా విలీన మండలాల్లో విద్యుత్తు సదుపాయాన్ని ఎందుకు పునరుద్ధరించలేకపోయారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వరద బాధితులకు కనీస సదుపాయాలు అందకపోవడంతోనే ఎటపాక మండలంలోని ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విపక్షాలు వేసిన ప్రశ్నలపై ఎదురుదాడి మాని ప్రజల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయని ఆయన సూచించారు. వరదల్లో చనిపోయిన పశువుల కళేబరాలతో దుర్గంధం మధ‌్య ఇళ్లలోకి విషసర్పాలు చేరడంతో ప్రజలు నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారని, వారి బాగోగులు ప్రభుత్వం పట్టించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు.
ప్రతిపక్ష ప్రశ్నలపై ఎదురుదాడి చెయ్యడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయి. వరదకు చనిపోయిన పశువుల కళేబరాలతో, ఇళ్లలో విష సర్పాలతో, దోమలు, పురుగులతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధిత ప్రజల వేదన తెలుసుకోండి.(4/5)
— N Chandrababu Naidu (@ncbn) July 24, 2022