ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వుంది. క్యాసినో వ్యవహారం కాక రేపుతోంది. టీడీపీ నేతలు మంత్రి కొడాలి నానికి సవాళ్ళు విసురుతున్నారు. టీడీపీ నేతలు నిజనిర్దారణకు వెళ్ళగా.. వారిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమా కొడాలి నానిపై విరుచుకుపడ్డారు.
మీ కన్వెన్షన్ సెంటర్ లో ఏ తప్పూ జరగకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని మంత్రి కొడాలి నానిని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. కొడాలి నాని అడ్డంగా దొరికిపోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ఆయన విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామని… ఆయన కన్వెన్షన్ సెంటర్ లో కేసినో ఆటలు జరిగాయని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
చెరో డబ్బా పెట్రోల్ తెచ్చుకుందామని… తేల్చుకుందామని ఉమ అన్నారు. కేసినోలో డ్యాన్స్ చేసిన వారి పేర్లు కూడా తమ వద్ద ఉన్నాయని… విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్లు డ్యాన్స్ చేశారని చెప్పారు. కేసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు తాను సిద్ధమని, జరిగినట్టు రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
కేసినో జరిగిందని మీడియా ముఖంగా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. మహిళల అర్థనగ్న నాట్యాలను తానే ఆపించానని కొడాలి నాని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసినో జరిగిన వీడియోలను మీడియాకు చూపించారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేత వర్లరామయ్య చేసిన వ్యాఖ్యలు పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. క్యాసినో వ్యవహారంతో వరుస సవాళ్ళతో రాజకీయాలు రంజుగా మారాయి.