Site icon NTV Telugu

Cement Rates Effect: మండుతున్న సిమెంట్.. నిర్మాణరంగానికి గడ్డురోజులే

Cement 1

Cement 1

నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్‌ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్‌ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్‌ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్‌ గత 6 నెలల్లో 30 నుంచి 50 శాతం పెరిగాయి. దీంతో సిమెంట్‌ ధరలు కూడా భారీగా పెరగొచ్చంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా బొగ్గు, పెట్‌కోక్‌, పెట్రోలియం దిగుమతుల భారం పెరుగుతోంది. ప్రస్తుతం బస్తా సిమెంట్‌ బ్రాండ్‌ ను బట్టి 350 నుంచి 450 రూపాయల వరకు ఉంది. ఈ నెలలోనే మరో 25 నుంచి 50 రూపాయలు పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.

మార్చి క్వార్టర్‌లో పెట్‌ కోక్‌ ధరలు అంతర్జాతీయంగా 43 శాతం పెరిగాయి. దేశీయ పెట్‌ కోక్‌ ధరలు మార్చిలో 26 శాతం, ఏప్రిల్‌లో 21 శాతం మేర పెరిగాయి. పెట్‌కోక్‌ దిగుమతి వ్యయం ఏడాది క్రితంతో పోలిస్తే ఒక్కో టన్నుపై 130 డాలర్ల మేర పెరిగింది. ఆస్ట్రేలియాలో వాతావరణం అనుకూలించక, ఇండొనేషియాలో నిషేధం వల్ల బొగ్గు ఎగుమతులు తగ్గాయి. దీంతో ధర పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 115 డాలర్ల వరకు పెరిగింది. ఇండియాలో బల్క్‌ డీజిల్ లీటర్‌పై 25 రూపాయలు పెంచారు.

రిటైల్‌ ధర కూడా మార్చి నుంచి 10 రూపాయల వరకు పెరిగింది. సిమెంట్‌ రవాణా 50 శాతం వరకు రోడ్లపైనే జరుగుతోంది. పెరిగిన డీజిల్‌ ధరల కారణంగా రవాణా ఖర్చులు, పెట్‌కోక్‌, బొగ్గు ధరల పెరుగుదల కారణంగా ఉత్పత్తి, ప్యాకేజింగ్‌ ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌ వినియోగం 5-7 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. దేశీయ సిమెంటు వినియోగంలో 60 శాతం ఇళ్ల నిర్మాణానికే వెళ్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ హాఫ్‌లో సిమెంట్‌కు 20 శాతం గిరాకీ పెరిగింది. అయితే సెకండాఫ్‌లో అకాల వర్షాలు, ఇసుక, కూలీల కొరతతో 7 శాతం మేర తగ్గింది. అయితే ఈసారి నిర్మాణ ఖర్చు భారీగా పెరగడంతో… సిమెంట్‌ గిరాకీ తగ్గొచ్చని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

Read Also: New Crime: వెలుగులోకి కొత్త తరహా మోసం.. మీకు తెలియకుండానే బ్యాంకులో అప్పులు

Exit mobile version