మీకు భూములు ఉన్నాయా? భూముల పేరుతో బ్యాంకులో అప్పు తీసుకున్నారా? ఒకవేళ తీసుకోకపోతే.. మీ భూమి ఎవరి పేరుతో ఉంది..? బ్యాంకులో అప్పులు ఉన్నాయా అర్జెంటుగా ఒక్కసారి చెక్ చూసుకోండి. ఇదంతా ఎందుకంటారా..? ఎందుకంటే మీకు తెలియకుండానే కొందరు మోసగాళ్లు మీ పేరున లీజు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదో కొత్త తరహా మోసం. లీజు అగ్రిమెంట్ ఆధారంగా బ్యాంకు నుంచి అప్పులు దర్జాగా పొందుతున్నారు. ఇప్పుడు తూ.గో. జిల్లాలోని కడియం ప్రాంతంలో ఈ తరహా మోసం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ళ కిందట చనిపోయిన వ్యక్తి తమకు భూమి లీజుకిచ్చారంటూ లీజు అగ్రిమెంట్ పత్రాన్ని సృష్టించి ఆ పత్రాలతో బ్యాంకు లోనుకు కొందరు ప్రబుద్ధులు ప్రయత్నించారు. తీరా బ్యాంకు అధికారులు భూ యజమాని కోసం వచ్చి లీజు అగ్రిమెంట్ రుణంపై ఆరా తీయడంతో నాలుగేళ్ళ కిందటే చనిపోయాడని తెలిసి అవాక్కయ్యారు. విలువైన భూములు కలిగిన కడియం నర్సరీల్లో కొందరు దస్తావేజు లేఖర్ల మాయాజాలంతో రైతులు గుండెలు బాధుకుంటున్నారు.
తూ.గో. జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన గట్టి నారాయణరావుకు వీరవరం రెవెన్యూ పరిధిలో మూడున్నర ఎకరాల భూమి ఉంది. భూమిపై ఎలాంటి అప్పులు లేవు. అయితే రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన ఉప్పలపాటి బసవన్న చౌదరికి ఈ భూమిని 12 సంవత్సరాలకు లీజు అగ్రిమెంట్ చేసినట్లు డాక్యుమెంట్లు పెట్టి కాకినాడ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అసలు రైతును కలిసి వివరాలు సేకరించమని కడియం మండలం బుర్రిలంక బ్రాంచ్ కు డాక్యుమెంట్లు పంపారు.
వీరు పొట్టిలంక రైతు ఇంటికెళ్లి లీజుపై ఆరా తీసారు. నారాయణరావు కుమారుడు మణికంఠ ఎవరికీ లీజుకి ఇవ్వలేదని బ్యాంకు అధికారులకు చెప్పారు. మీరు కాదు భూమి యజమాని ఈ విషయం చెప్పాలని కాస్త గట్టిగానే అడిగారు. తన తండ్రి నాలుగేళ్ల క్రితం మృతి చెందితే గత నెలలో రిజిస్ట్రేషను ఆఫీసుకు వచ్చి ఎలా లీజు అగ్రిమెంట్ చేసారని మణికంఠ ఇంకా గట్టిగా చెప్పడంతో బ్యాంకు అధికారులకు మతిపోయింది. ఇదే విషయాన్ని కాకినాడ బ్యాంకుకు నివేదించారు.
అయితే మరణించిన రైతు పేరున లీజు అగ్రిమెంట్, బ్యాంకు అప్పులు అనేసరికి బెంబేలెత్తిపోయిన మణికంఠ కడియం పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు మణికంఠ ఫిర్యాదుపై కడియం సీఐ రాంబాబు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు . అయితే లీజు అగ్రిమెంట్‌లో సాక్షులుగా పొట్టిలంక గ్రామానికే చెందిన ఈలి శ్రీను, గట్టి చంద్ర శేఖర్ పేర్లు ఉన్నాయి. పోలీసులు వీరి గురించి ఆరా తీయగా ప్రస్తుతం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. అయితే అసలు ఈ లీజు అగ్రిమెంట్ కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిందా వేరే ఎక్కడైనా జరిగిందా అనేది తేలాల్సి ఉంది. కొందరు దస్తావేజు లేఖర్లు డబ్బులు కోసం ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులలో ఎలాంటి అప్పులు తీసుకోని వారిని గుర్తించి ఇలా లీజు అగ్రిమెంట్ పేరుతో దొడ్డి దారిన అప్పులు పొందుతున్నారు. లీజు అగ్రిమెంట్ అడ్డం పెట్టుకుని పలు వ్యాపారాలు పేరుతో అప్పులు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి రిజిస్ట్రేషన్ అయితే పాస్ బుక్ లు, ఆన్ లైన్‌లో పేరు మార్పులు జరిగితేనే బ్యాంకు అప్పు ఇస్తుంది. ఇలా లీజు అగ్రిమెంట్ పేరుతో సులభంగా బ్యాంకు నుంచి అప్పులు పొందే కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇందుకే రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను ఇసీ ద్వారా తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు.