ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20-30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300-350 మధ్యలో ఉంటుందని తెలిపారు.
Read Also: కరోనాకు టాబ్లెట్ వచ్చేసింది… ధర ఎంతో తెలుసా?
గత నెలలో డిమాండ్ తగ్గడంతో సిమెంట్ బస్తాల ధరలను రూ.20 నుంచి రూ.40 వరకు కంపెనీలు తగ్గించాయి. డిసెంబర్ నెలాఖరు నుంచి మళ్లీ సిమెంట్ విక్రయాలు పెరగడం, ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్ ఏర్పడటంతో తాజాగా కంపెనీలు సిమెంట్ ధరలను పెంచినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ప్రభుత్వం గృహ నిర్మాణ పథకానికి సంబంధించి సిమెంట్ కొనుగోలు చేస్తుండంతో గిరాకీ ఏర్పడిందని విజయవాడకు చెందిన డీలర్లు చెప్తున్నారు. ధర పెంచిన సిమెంట్ కంపెనీల్లో ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, సాగర్ సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, దాల్మియా భారత్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి.
