Byreddy Siddharth Reddy: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని, వైసీపీ యువనేత, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శించారు. మధ్యంతర బెయిల్ అనంతరం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తిరిగి రిమాండ్ కొనసాగుతున్న మిథున్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డితో పాటు రాజమండ్రి రుడా మాజీ చైర్మన్ షర్మిలా రెడ్డి ఇవాళ ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో మూడు దశాబ్దాలుగా పెద్దిరెడ్డి కుటుంబం ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు. నారా లోకేష్ భవిష్యత్తుకు మిథున్ రెడ్డి అడ్డుగా మారతాడనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అలాగే, సుగాలీ ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు టీడీపీ వారిపైనే ఆరోపణలు చేస్తున్నారని విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయంపై దశల వారీగా ఉద్యమాలు చేస్తామని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Sprouts: మొలకెత్తిన ధాన్యాలు పచ్చిగా తింటే మంచిదా? లేక ఉడికించి తింటే మంచిదా?
ఇక, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తమకు ఆశ్చర్యం కలిగించిన విషయం కాదు అని శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు చేస్తారని తెలుసు అన్నారు. మిథున్ రెడ్డి గెలిచింది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనా.. మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారు అని ఆరోపించారు. ఇంత వరకు మిథున్ రెడ్డి మీద కస్టడీ పిటిషన్ వేయలేదంటేనే ఇది అక్రమ కేసు అని మనం అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల ముందు 20 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా వెనక్కి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అలాగే, నకిలీ మద్యం సేవించి వేలాది మంది చనిపోయారని అసత్య ప్రచారం చేశారు.. నకిలీ మద్యం కేసులో ఎవరినైనా ఇంత వరకు అరెస్టు చేశారా అని సిద్ధార్థ్ రెడ్డి అడిగారు.
