ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి పదవులు లభిస్తాయో తెలీదు. అందునా ఇతర పార్టీల్లోకి వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వచ్చినవారి విషయంలో వెయిట్ అండ్ సీ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా మాజీ ఎంపీ బుట్టా రేణు విషయంలో అదే జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాజీ ఎమ్పీ బుట్టా రేణుకకు పార్టీ పదవి వరించింది. కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించింది వైసీపీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది పార్టీ.
బుట్టారేణుక గత కొంతకాలంగా స్తబ్ధంగా వున్నారు. ఆమె రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తారని ప్రచారం సాగింది. అయితే ఆమె దీనిపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కంటే ఎంపీగా కొనసాగడమే తనకు అమితంగా ఇష్టమని.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననడం ఊహాగానాలేనన్నారు. తనకు ఈ విషయంపై అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని.. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా గాని.. ఎంపీగా గాని పోటీ చేసి గెలిచి ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు రేణుక.
ఎమ్మిగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి వున్నారు. ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని, తన వారసుడిగా తన కొడుకు జగన్ మోహన్ రెడ్డిని నిలబడతారనే ప్రచారం సాగింది. అక్కడ బుట్టా రేణుక పోటీచేసే అవకాశమే లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఆమె ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీచేయడం బెటర్ అంటున్నారు.
బుట్టా రేణుక వైసీపీ తరఫున గెలిచి, తర్వాత 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరడంపై విమర్శలు వచ్చాయి. పారిశ్రామిక వేత్తగా వున్న బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. వైఎస్సార్‌సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీని వీడి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీలో చేరారు.
2019 ఎన్నికలకు ముందు టీడీపీ తనను మోసం చేసిందంటూ మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.. పార్టీని వీడినందుకు జగన్‌కు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. అలాగే గత ఎన్నికల్లో ఎలాంటి పదవి లేకపోయినా జిల్లాలో వైసీపీ అభ్యర్ధుల్ని గెలిపించేందుకు ఆమె ప్రయత్నించారు. ఆమె పై వున్న అపప్రథ పోవడంతో పార్టీ అధిష్టానం ఆమెకు పదవి కట్టబెట్టింది. మరి 2024 ఎన్నికల్లో బుట్టా రేణుక ఎక్కడినించి పోటీచేస్తారో వేచి చూడాల్సిందే.
Common Wealth Games 2022: లాంగ్ జంప్ ఈవెంట్‌లో ఫైనల్‌కు మురళీ శ్రీశంకర్, మహమ్మద్ అనీస్