వైఎస్ జగన్ కేసుల్లోనూ సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది భద్రత పెంచండి అంటూ సీబీఐ అధికారులకు సూచించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. కాకాని కేసులో సాక్ష్యాలని కోర్టు నుంచే దొంగిలించడం దుర్మార్గం అని పేర్కొన్న ఆయన.. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి పోతుందనే భయంతోనే కోర్టులో ఉన్న సాక్ష్యాలను దొంగిలించారని ఆరోపించారు. జగన్ కేసుల్లో కూడా సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది.. సీబీఐ వాళ్లు ఆ సాక్ష్యాలకు మరింత భద్రత ఏర్పాటు చేయాలన్నారు.. వైఎస్ వివేకా హత్య కేసులోని ఆధారాలు కూడా భద్రత కల్పించాలన్నారు. ఇక, వైసీపీ కుల పార్టీనా, టీడీపీ కుల పార్టీనా తేల్చుకుందాం రా.. అంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.. ఉత్తరాంధ్రకు జగన్ నిన్ను ఇంఛార్జిగా వేస్తే.. చంద్రబాబు నన్ను ఇంఛార్జిగా వేశారు.. మరి ఎవరిది కుల పార్టీ, ఎవరు కులం చూసుకున్నారు.? అని ప్రశ్నించారు.. జగన్ అవినీతిలో భాగమై, జైలుకెళ్లినందుకే మీకు రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు.. జగన్ వచ్చాక ఉన్న ఉద్యోగాలే పోయాయి. ఇప్పుడు జాబ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టారని విమర్శించారు.
Read Also: COVID 4th Wave: కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే.. భారత్‌లో ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయ్యిందా..?!
రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసున ఘనుడు వైఎస్ జగన్ అంటూ ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న.. కొడాలి నాని, వెల్లంపల్లి, రంగరాజు చెప్పారని వారి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వలేదని.. ఆ మాజీ మంత్రులకూ.. జగనుకు మధ్య ఉన్న డీలింగ్స్ ఏమిటో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఆ సామాజిక వర్గాల్లో వాళ్లే మంత్రులు కావాలా…? అని నిలదీసిన వెంకన్న.. ఆ మాజీ మంత్రులు బినామీలుగా ఉన్నారు కాబట్టే జగన్ ఆ సామాజిక వర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
ఉత్తరాంధ్ర భూ బకాసురుడు సాయిరెడ్డి..
ఇక, ఉత్తరాంధ్ర భూ బకాసురుడు విజయసాయిరెడ్డి అని ఆరోపించారు బుద్దా వెంకన్న.. జగన్ సర్కారుకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయన్న ఆయన.. బీసీలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. తమ చెప్పు చేతుల్లో ఉండేవారికి మంత్రి పదవులు ఇచ్చి బీసీలకు ఇచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. బీసీలపై జగనుది కపట ప్రేమ.. బీసీలను ఆర్ధికంగా వైసీపీ దెబ్బతీసిందన్న ఆయన.. ఏపీలో రూ. 2 వేల రూపాయల నోట్లు దొరక్కుండా వైసీపీ దాచి పెట్టిందన్నారు. విజయసాయి రెడ్డి వయసుకు తగ్గ విధంగా మాట్లాడాలి.. లోకేష్‌కు నిక్ నేమ్ పెడితే.. మేం చిప్ప కూడు విజయసాయి రెడ్డి అని పిలుస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు మెత్తగా ఉన్నారనే కేంద్రానికి పంపారన్న ఆయన.. చెప్పిన విధంగా నోరు పారేసుకునే బీసీలే వైసీపీకి కావాలా..? అని ప్రశ్నించారు. తన చెప్పు చేతల్లో నడిచే వారికే నేడు జగన్ మంత్రి పదవులు ఇచ్చారని.. ఎన్టీఆర్, చంద్రబాబు వల్లే బీసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందారని.. బీసీలకు ఇచ్చే అదరణ, పథకాలను జగన్ రద్దు చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టి లో ఉంచుకునే ఇప్పుడు జగన్ బీసీల మంత్రం జపిస్తున్నారని విమర్శించారు బుద్దా వెంకన్న.