Site icon NTV Telugu

BRS Hot Topic in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న BRS

Kcr Brs

Kcr Brs

ఇవాళ మధ్యాహ్నం వరకూ టీఆర్ఎస్.. కానీ ఆ తర్వాత టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిపోయింది. తెలంగాణా రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా అవతరించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక చర్చ మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభావం చూపగలుగుతుందా? నిన్నటి వరకు విమర్శలకు పరిమితం అయిన టీఆర్‌ఎస్‌ నేతలు…ఇప్పుడు రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తారా? చేరికల కసరత్తు చేస్తారా? అయితే ఈ ప్రశ్నలకు అధికార వైసీపీ మాత్రం ఏ పార్టీకి రాష్ట్రంలో అంత సీన్‌ లేదంటోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వల్ల రాష్ట్రంలో ఎలాంటి మార్పులు వుండవంటున్నారు.

నిన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి రూపం మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లోకి ప్రస్థానం ప్రారంభించింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా పేరు మారుస్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ భారత రాష్ట్ర సమితి పై చర్చ ప్రారంభం అయ్యింది. ఏపీలో బీఆర్‌ఎస్‌ రాజకీయ కార్యక్రమాలు చేపడుతుందా? చేరికలు వుంటాయా? ప్రజల మద్దతు కూడగట్టేందుకు సభలు, సమావేశాలు నిర్వహించనుందా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు హరీష్‌ రావు, గంగుల, ఎర్రబల్లి దయాకర్‌ వంటి టీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పై విమర్శలు మొదలు పెట్టారు.

Read Also: Earthquake Hits Iran: ఇరాన్‌లో భారీ భూకంపం.. 500 మందికి గాయాలు

జాతీయ రాజకీయాల్లో ప్రస్థానం మొదలు పెట్టే క్రమంలో పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఏపీలో రాజకీయ ప్రయత్నాలు కీలకంగా మారతాయి. దీనితో అధికార వైసీపీ బీఆర్‌ఎస్‌ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. బీఆర్ఎస్‌ ఎలాంటి సిద్ధాంతాలను ప్రకటిస్తుంది? కార్యాచరణ ఏ రకంగా ఉండనుంది? జాతీయ స్థాయి సమస్యల పై ఎలాంటి వైఖరిని అవలంబిస్తుంది వంటి అంశాలను నిశితంగా గమనిస్తుంది. అదే సమయంలో ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఒక కొత్త జాతీయ పార్టీకి రాష్ట్రంలో స్పేస్‌ లేదని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీల ప్రభావం చాలా రాష్ట్రాల్లో లేదు. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలే పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో అంతగా వుండదని ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రకటించారు. మరికొందరు మంత్రులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు.

2014లో జరిగిన రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోయింది. బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితిలో లేదు. ఇటువంటి సమయంలో మరో కొత్త రాజకీయ పార్టీకి రాష్ట్రంలో అవకాశం లేదంటున్నారు వైసీపీ నేతలు. ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా…ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే సరికి బీఆర్‌ఎస్‌కు కొన్ని అంశాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముంపు ఉందని కేంద్రం దగ్గర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేసీఆర్‌ …ఏపీలో అడుగు పెట్టి అదే బీఆర్‌ఎస్‌ విధానంగా చెప్పలేరు. అలాగే ముంపు మండలాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ , విద్యుత్‌ బకాయిలు వంటి చాలా అంశాలు ఉన్నాయి. ఒక ప్రాంతీయ పార్టీకి తీసుకున్న విధానాలను జాతీయ పార్టీగా మారిన తర్వాత కొనసాగించటం క్షేత్ర స్థాయిలో సాధ్యం కాదు. ఇటువంటి అంశాలు వైసీపీ ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉంటుంది.

Read Also: Tollywood: వరాల విజయదశమి.. అక్టోబర్ శుభారంభం

Exit mobile version