NTV Telugu Site icon

BRS in AP: ఏపీలో బీఆర్‌ఎస్‌ బిగ్‌ ప్లాన్..! గంటా, సీబీఐ మాజీ జేడీతో వివేక్‌ భేటీ..

Brs

Brs

BRS in AP: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసి జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్‌ పెట్టారు.. కలిసి వస్తున్న నేతలకు కండువాలు కప్పి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.. ఇక, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు బీజం పడగా.. మరికొందరు నేతలను ఆహ్వానించేపనిలో పడిపోయారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలు కూడా పార్టీలో చేరతారని బీఆర్ఎస్‌ నేతలు చెబుతున్నమాట.. దీంతో, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరు ఏపీ వెళ్లినా.. వారిని ప్రత్యేకంగా చూస్తున్నారు. తాజాగా, ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వివేక్‌ సమావేశం అయ్యారు.. అంతే కాదు, గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ లోక్‌సభ స్థానం బరిలో నిలిచిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కూడా వివేక్‌ కలిశారు.. ఇప్పుడు.. పొలిటికల్‌ సర్కిల్‌లో ఇది హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. విశాఖ వెళ్లిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద.. గంటా, వీవీ లక్ష్మీనారాయణతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారని.. త్వరలోనే వారు గులాబీ కండువా వేసుకుని కారు ఎక్కుతారనే ప్రచారం ఊపందుకుంది.

Read Also: Telangana Cabinet Meeting: ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్.. బడ్జెట్ ఆమోదం..

అయితే, గంటా శ్రీనివాసరావు గానీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వర్షన్‌ గానీ వేరుగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఓ వివాహ వేడుక కోసం వైజాగ్ వచ్చారు.. బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని పిలిస్తే వచ్చివెళ్లారని తెలిపారు గంటా శ్రీనివాసరావు.. అంతే కానీ, మా మధ్య ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేతో రాజకీయ చర్చలు మీడియా ప్రచారం మాత్రమేనని కొట్టిపారేసిన ఆయన.. తాను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కలిసి చాలా కాలం అయ్యిందన్నారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మరోవైపు.. ఎమ్మెల్యే వివేక్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్న కొట్టిపారేశారు వీవీ లక్ష్మీనారాయణ.. ఓ పెళ్లిలో వివేక్ కలిశాడు, టీ కోసం ఇంటికి ఆహ్వానిస్తే వచ్చి వెళ్లారంతే తప్పితే.. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, అనిల్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పెళ్లి నిన్న వైజాగ్‌లో జరగగా.. ఆ పెళ్లి కోసమే కుత్బుల్లాపూర్ ఎమ్మేల్యే వివేకానంద వెళ్లారని చెబుతున్నారు.. అయితే, ఏదేమైనా.. ఇప్పుడు.. పొలిటికల్‌ సర్కిల్‌లో ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఇప్పటికే ఎన్నికల వ్యూహాల్లో అన్ని పార్టీలు మునిగిపోయాయి.. రాజకీయం మరి.. ఏ పార్టీ నేత.. ఏ కండువాతో కనబడతారో తెలియాలంటే.. మరికొంత కాలం ఆగాల్సిందే.