Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్‌కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే అంతే ఇవ్వగలమన్నారు. ప్రభుత్వం ఇంత కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు చెప్పిన ప్రతిపాదనలపై మరోసారి ఆలోచించుకోమని ఉద్యోగులకు సూచించినట్లు బొత్స తెలిపారు.
జీపీఎస్ అంశంపై మరోసారి సమావేశమై మళ్ళీ చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు. దేశంలో లక్షలాది మంది రైతులకు గ్యారెంటీ ఉందా.. నాయకులం తమకు గ్యారెంటీ ఉందా.. కానీ అదృష్టవశాత్తు ఉద్యోగులకు గ్యారెంటీ ఉందని బొత్స అన్నారు. ఉద్యోగులు ఆందోళన చేస్తాం అంటే తాము ఏం చేయగలుగుతామని నిలదీశారు. ఉద్యోగులపై పెట్టిన కేసుల గురించి కూడా చర్చించామని.. గురువారం నాడు ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాలు తీసుకుని వెళతామన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధి ఉందా అని బొత్స మండిపడ్డారు. ఆయన అసెంబ్లీలో ఏమీ మాట్లాడకుండానే ఇంట్లో ఉండే మహిళల గురించి, ముఖ్యమంత్రి భార్య గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇది నీచమైన ధోరణి కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని మీదే కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు.
Read Also: Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
అటు సీపీఎస్ రద్దుపై చర్చించాలని మరోసారి మంత్రులను కోరామని ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు అప్పలరాజు వెల్లడించారు. జీపీఎస్ అమలుపై మాత్రమే చర్చించాలని మంత్రులు కోరారని.. అందుకే మంత్రులతో చర్చలను బహిష్కరించామన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ చేసే వరకు తాము నిరసనలు ఆపేది లేదన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ కోసమే చర్చలకు ఆహ్వానిస్తే అప్పుడే చర్చలకు వెళ్తామన్నారు. సీపీఎస్ రద్దు చేయాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని ఏపీసీపీఎస్‌ఈఏ ప్రధాన కార్యదర్శి పార్ధసారథి అన్నారు. సీపీఎస్ రద్దు కాకుండా ఇతర జీపీఎస్‌కు ఒప్పుకునేది లేదన్నారు. సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంతో తమకు సంబంధం లేదన్నారు. సీపీఎస్ రద్దుపై తాము చేస్తోన్న పోరాటం తమకు జీవన్మరణ సమస్య అన్నారు. తాము ఉద్యమాలు చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. సీఎం జగన్ అయితే తమకు న్యాయం జరుగుతుందని భావించామని.. 60ఏళ్ల తర్వాత తమ బతుకులు ఏమవుతాయోననే ఆందోళన తమను వెంటాడుతుందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని.. ఈ నెల 11న కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నామన్నారు. టీచర్లపై వేధింపులతో ఆందోళన పడుతోన్న దృష్ట్యా నిరసన కార్యక్రమం వాయిదా వేస్తున్నామని.. జీపీఎస్ అమలుపై ప్రభుత్వం బలవంతంగా ముందుకు వెళితే కాలమే సమాధానం చెబుతుందన్నారు.