వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున తెలుసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యంగా తిరుపతి లో ప్రారంభించామన్న కరుణాకర రెడ్డి.. ప్రతి గడప గడప కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కు గత ఎన్నికల్లో తిరుపతిలో 89 వేల మంది ఓట్లు వేస్తే, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షలు 20 వేల మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 1600 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి ఇంటికి అందించామని, సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వమని ఆయన అన్నారు.