శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ప్రజలపై దాడి చేసిన ఎలుగుబంటి చనిపోయింది. తీవ్రమైన గాయాలతో విశాఖకు తరలిస్తుండగా ఎలుగుబంటి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఉద్ధానంలో సోమవారం తెల్లవారుజామున పొలం పనుల కోసం వెళ్లిన కొందరిపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. కొందరు ఈ దాడి నుంచి తప్పించుకోగా ఏడుగురు వ్యక్తులు ఎలుగుబంటి దాడిలో గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అటు ఎలుగుబంటి దాడిలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా గాయపడ్డాయి. సుమారు 10 ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో ఉద్దానంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. ఎట్టకేలకు అధికారులు తీవ్రంగా శ్రమించి మంగళవారం నాడు ఎలుగుబంటిని పట్టుకున్నారు. అధికారులు ఎలుగుబంటిని పట్టుకునే ఘటనలో భల్లూకం తీవ్రంగా గాయపడింది. దీంతో ఎలుగుబంటికి వైద్యపరీక్షలు నిర్వహించి ఏఆర్సీకి తరలించాలని అధికారులు ప్రయత్నించారు. అంతలోనే భల్లూకం చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
ఎలుగుబంటి మృతికి తీవ్రమైన గాయాలే కారణమని జూ క్యూరేటర్ నందిని సలారియా వెల్లడించారు. ఎలుగుబంటి ప్రతి అవయవానికి తీవ్రగాయాలు ఉన్నాయన్నారు. ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కర్రలతో కొట్టినట్టు కనిపించిందన్నారు. ఇతర జంతువుల దాడిలో కూడా గాయపడిందన్నారు. తమ దగ్గరకు వచ్చే సరికే ఎలుగుబంటి చనిపోయిందని.. చనిపోయిన భల్లూకాన్ని ఆడ ఎలుగుబంటిగా నిర్ధారించినట్లు నందిని సలారియా తెలిపారు. ఎలుగుబంటి మృతికి గల కారణాలను, పోస్ట్ మార్టం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎలుగుబంటికి దహనం చేస్తామని పేర్కొన్నారు..
కాగా అంతకంటే ముందు వజ్రపు కొత్తూరు మండలంలోనూ ఎలుగుబంటి పలువురిపై దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో ఓ రైతు కూడా మరణించాడు. మరణించిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 2.5 లక్షలు చెల్లిస్తామని.. అనంతరం మరొక రూ.2.5లక్షలు మొత్తంగా ప్రభుత్వం తరపున రూ.5లక్షల పరిహారం చెల్లిస్తామని మంత్రి సిదిరి అప్పలరాజు ప్రకటించారు.