పెళ్ళి, సీమంతం, ఆషాఢమాసం సారె, సంక్రాంతికి ఇంటి అల్లుడికి అదిరిపోయే మర్యాదలు, వియ్యపురాలి సారె… కోడిపందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. అక్కడ ఏ వేడుక జరిగినా బ్రహ్మాండంగా వుంటుంది. అమ్మాయో, అబ్బాయో పుట్టినా.. వారికి బారసాల చేయడం ఆనవాయితీ. కాకినాడ జిల్లాలో ో పెద్దాయనకు ఆవులు, ఆవుదూడల్ని పెంచడం హాబీ. తన కుటుంబంలో సభ్యులుగా వాటిని సాకుతుంటారు.
తాజాగా 3నెలల పుంగనూరు ఆవు దూడకు బారసాల చేశారు డాక్టర్ గౌరీ శేఖర్ దంపతులు. వేదమంత్రాలతో కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో శాస్త్రోక్తంగా జరిపిన వేడుక జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. నా బారసాలకు రండి అంటూ పుంగనూరు ఆవుదూడ పిలిచినట్టుగా ఆహ్వాన వీడియో తయారుచేశారు. బంధువులు అంతా తరలి రాగా.. చిన్నపిల్లల్ని వేసినట్టు ఉయ్యాలలో వేసి జోలపాడారు. ఆ లేగదూడను పిల్లల్ని పెంచినట్టు పెంచుతున్నారు డాక్టర్ గౌరీ శేఖర్ దంపతులు. ఆ లేగదూడ కూడా వీరికి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ బారసాలకు వచ్చిన బంధువులు కూడా వీరి అనుబంధాన్ని చూసి నవ్వుకున్నారు.
గత ఏడాది కాకినాడ సమీపంలోని యానాంలో అల్లుడికి మామగారు పంపిన ఆషాఢం సారె రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్‌కు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో పెళ్ళయింది. సారెలో భాగంగా అల్లుడికి పెళ్ళికూతురు తండ్రి భారీగా సారె పంపారు.
వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్‌లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పెళ్లికొడుకు పవన్ ఇంటికి చేరాయి. ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్ కుమార్. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. అట్లుంటాది మరి గోదారోళ్ళ మర్యాదలు, ఆప్యాయతలు.
Jabardasth: ‘అదిరే అభి’కి ప్రమాదం.. చేతికి 15 కుట్లు