ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేను అని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఎన్టీవీ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట వాస్తవమే అని.. కానీ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని సమాధానమిచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. తనకు ప్రతి పార్టీలో స్నేహితులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో రంజిత్‌రెడ్డి తనకు మంచి స్నేహితులు అని.. స్నేహానికి, రాజకీయానికి సంబంధం లేదని బండ్ల గణేష్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలన చాలా బాగుందని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు అని చెప్పడానికి తన దగ్గర ఎలాంటి ఆరోపణ లేదని పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని నొక్కి చెప్పారు. ఈరోజు ఇండియాలోనే నంబర్ వన్ స్టేట్ అంటే తెలంగాణ అని మాట్లాడారు.
ఇటీవల పక్క రాష్ట్రాల గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడినప్పుడు.. ఏపీలోని వైసీపీ మంత్రులు ఎందుకు స్పందించారో తనకు తెలియదని బండ్ల గణేష్ వెల్లడించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే వైసీపీ వాళ్లు భుజాలు ఎందుకు తడుముకున్నారని ఆరోపించారు. అయితే హైదరాబాద్‌లో కరెంట్ లేదని మంత్రి బొత్స ఆరోపించడంపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా.. తనను కొందరి గురించి అడగొద్దని బండ్ల గణేష్ సూచించారు. తనకు పవన్ కళ్యాణ్ దేవుడు అని.. తాను చచ్చిపోయేదాకా పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటానని స్పష్టం చేశారు. అటు బొత్స సత్యనారాయణ తనకు అన్న లాంటి వారు అని బండ్ల గణేష్ చెప్పారు. టీడీపీలోనూ తనకు చాలా మంది సన్నిహితులు ఉన్నారని తెలిపారు.
కాగా విజయసాయిరెడ్డితో ఇటీవల జరిగిన ట్విట్టర్ వార్ గురించి బండ్ల గణేష్ స్పందించారు. విజయసాయిరెడ్డికి ఓ వ్యక్తిపై కోపం ఉంటే ఆ వ్యక్తితోనే తేల్చుకోవాలని.. అంతేకానీ కులం పేరుతో అందరినీ దూషించడం సరికాదనే తాను ట్వీట్ల రూపంలో సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా కులం పేరుతో దూషించడం సరికాదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు. తనకు కులపిచ్చి లేదని స్పష్టం చేశారు. టీడీపీ ఓ సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మాట అవాస్తవమని.. టీడీపీ హయాంలో హోంమంత్రి చినరాజప్ప, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడిది ఏం సామాజిక వర్గమని బండ్ల గణేష్ ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలవాలంటే కులం కాదని దమ్ము ఉండాలని చెప్పారు. ఓటమి అనేది రేపటి గెలుపునకు నాంది అని.. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి మహామహులు కూడా ఓడిపోయారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అటు రాజకీయాల్లో రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవి రావడం శుభపరిణామమని బండ్ల గణేష్ అన్నారు. మంత్రి పదవి చేపట్టిన రోజాను సినీ పరిశ్రమ సన్మానించాల్సిన అవసరం ఉందన్నారు. రోజాను మంత్రిగా చూడటం చాలా ఆనందంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.