పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు.. విజయవాడలోని రోడ్లు.. ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆపలేకపోయాయి.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు తరలివచ్చారని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను ఉద్యోగస్తులు విజయవంతం చేశారన్న ఆయన.. రేపు మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఛలో విజయవాడకు వచ్చే ఉద్యోగస్తులకు మేం తగిన ఏర్పాట్లు చేయలేకపోయామన్నారు బండి శ్రీనివాసరావు.. కానీ, ప్రజలు స్వచ్చంధంగా వచ్చి మంచినీరు, ఆహారం అందించారని.. కొన్ని చోట్ల పోలీసులు మాకు సహకరించారు.. వారికి ధన్యవాదాలు అని తెలిపారు. మరోవైపు.. సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల ద్వారా పరిష్కరిద్దామని అంటున్నారు.. దీనిపై రేపు స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఉద్యోగస్తుల ఆశలను ఆవిరి చేయం.. సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు.