శ్రీకాకుళం : ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లో 155 స్థానాలతో టీడీపీ అధికారంలోకి రావడం తధ్యమని స్పష్టం చేశారు. ఇవాళ పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈరోజు ర్యాలీ జరుగుతుందని నేనసలు అనుకోలేదని… పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు బయటికి రావాలో అచ్చెన్నాయుడుకి తెలుసని… జగన్ ను ఎప్పుడు గద్దె దించాలో కూడా తెలుసని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షపార్టీ నిరసనలను అడ్డుకున్నది లేదని.. కానీ వైఎస్ జగన్ టీడీపీని నాశనం చేయాలనుకున్నాడని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలను , కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని… అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే టీడీపీ ఉండదనుకున్నారని పేర్కొన్నారు. టెక్కలిలో కొందరు వ్యాపారాల పై దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలందరూ సహనంగా ఉండాలని.. వచ్చేది టీడీపీ సర్కారేనని తెలిపారు.