Ashok Gajapathi Raju Fires On YCP Government: మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాని సాగనంపాల్సిన రోజులు వచ్చాయని అభిప్రాయపడ్డారు. గడచిన మూడేళ్లలో ఎక్కడా ఒక్క ఇళ్లు నిర్మాణం జరగలేదని దుయ్యబట్టారు. పన్నులు విపరీతంగా పెంచారని, కొత్త రకాల పన్నులను ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. చెత్త పన్ను కట్టకపోతే రేషన్‌తో పాటు పెన్షన్ కట్ చేస్తున్నారన్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. అసలు రేషన్ ఇస్తున్నారో లేదో కూడా తెలియడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయో లేవో తెలియడం లేదని, కేంద్రం అందించిన కొవిడ్ డబ్బుల్ని సైతం మళ్లించారని పేర్కొన్నారు. మూడేళ్లలో ఒక్క ఇన్స్‌టిట్యూడ్ కూడా ప్రారంభం కాలేదన్నారు.
అమరావతి రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేస్తే, వాటిని నాశనం చేశారని అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరా కోటి ఉంటుందని, రైతులకు మేలు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం.. కేవలం ముప్పై లక్షలే ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకొని, వ్యాపారం చేయడానికి చూస్తోందని ఆరోపణలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేసి, ఎన్నో ఉద్యోగాలు కల్పించారని.. అలాంటి ప్రణాళికలు ఏపీలో ఎందుకు చెయ్యడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టును పక్కన పెట్టేశారని, నిధులు ఏమవుతున్నాయో అర్ధం కావడం లేదని తెలిపారు. ఏ అంశం మీదనైనా రాజ్యాంగ బద్దంగా చర్చి జరగాల్సి ఉంటుందని, కీనా ఈ ప్రభుత్వం చర్చించడానికి అవకాశమే ఇవ్వడం లేదన్నారు. మూడు రాజధానులు ఇస్తామని చెప్తోన్న ఈ ప్రభుత్వం.. విశాఖలోని అన్ని ఐటీ కంపెనీలను నాశనం చేసి, వారిని వెనక్కు పంపించేశారని, మళ్లీ ఉద్యోగ అవకాశాలే లేకుండా చేశారని తూర్పారపట్టారు.