దసరా పండుగ వచ్చేస్తోంది… ఈ సమయంలో ప్రయాణికులకు శుభవార్త వినిపించింది ఆర్టీసీ. ఈ నెల 29 వ తేదీ నుంచి వచ్చే నెల 10 వ తేదీ వరకు విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదారాబాద్ , చెన్నై మరియు బెంగళూరు ప్రాంతాల నుంచి విజయవాడకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది.. అంతేకాకుండా విజయవాడ నుంచి విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, తిరుపతి, భద్రాచలం, రాయలసీమ ప్రాంతాలకు సైతం ఈ దసరాకు బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. గత రెండేళ్లుగా కోవిడ్‌తో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్లు.. సొంతూళ్లకు దూరం అయ్యారు. అంతేకాదు కోవిడ్ నిబంధనలతో దసరా ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు తక్కువ అయిన పరిస్థితి. ప్రస్తుతం కరోనా భయం తోలగటంతో ఈ సారి ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు సంఖ్య అధికంగానే ఉంటుందని భావించిన అధికారులు ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. పండుగల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయటం మామూలే… దీనిని సైతం దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది కలుగకుడదు అనే ఉద్దేశ్యంతో మొత్తం 1,081 బస్సులను హైదారాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, తిరుపతి, భద్రాచలం ప్రాంతాలకు షటిల్ ట్రిప్పులను నడపనుంది ఆర్టీసీ.
Read Also: RBI Orders: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
అయితే, ప్రత్యేక బస్సులు అనగానే ప్రత్యేక చార్జీలు అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో.. ప్రత్యేక బస్సుల పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయటం లేదని ఆర్టీసీ ప్రకటించింది. దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సాధారణ చార్జీలతోనే ప్రయాణం చేయొచ్చని ప్రకటించింది. దీంతో ప్రయాణికులకు ఈ విషయం కలిసొచ్చే అంశంగానే చెప్పచ్చు. వీరికి రిజర్వేషన్ సౌకర్యన్ని కల్పించారు. మరోవైపు ఈ నెల 26 నుంచి దసరా పండుగ ముగిసే వరకు విజయవాడ వైపు నడిచే రైళ్లలో రిజర్వేషన్లు నిండిపోయాయి.. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీ స్ధాయిలోనే వుంది.. దసరాకు విజయవాడ వైపు మరికొన్ని ఎక్కువ సర్వీసులు నడిపితే ప్రయాణికుల రద్దీని మరింతా తగ్గే అవకాశం వుంటుంది. మరోవైపు.. ప్రత్యేక రైళ్ల ప్రస్తావన ఇంకా రైల్వే అధికారులు ప్రకటించాలేదు. గతంలో కోవిడ్ దృష్ట్యా స్వల్ప సర్వీసులనే తిప్పింది.. ఈసారి విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగానే వుంటుంది. దీంతో రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపితే తప్ప రద్దీని నియంత్రించటం కష్టమే అని చెప్పాలి… ప్రస్తుతం దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.