APSRTC: జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తొలి సభను నిర్వహిస్తున్నారు.. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు.. రాష్ట్ర నేతలు ఇలా.. చాలా మంది హాజరుకాబోతున్నారు.. ఇదే సమయంలో.. భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతోంది.. ఓవైపు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు.. సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు.. దీని కోసం భారీ జన సమీకరణకు పూనుకుంది ఏపీ బీఆర్ఎస్… ఏపీఎస్ ఆర్టీసీ నుంచి బస్సులను అద్దెకు తీసుకుంది. ఒక్క విజయవాడ జోన్ పరిధిలోనే 150 బస్సులను తీసుకున్నట్టు చెబుతు్నారు.. వీటిలో ఎన్టీఆర్ జిల్లాలో 105, ఏలూరు జిల్లాలో 45 బస్సులు ఉన్నాయి. ఒక్క విజయవాడ నుంచే 70కి పైగా బస్సులను అద్దెకు తీసుకున్నారు. దీనిని బట్టి విజయవాడ నుంచి అధిక సంఖ్యలో ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..
Read Also: BRS: బీఆర్ఎస్ తొలి సభకు సర్వం సిద్ధం.. గులాబీ పార్టీ బాస్ ప్రసంగంపై ఉత్కంఠ
ఇక, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు జగ్గయ్యపేట, తిరువూరు, ఏ.కొండూరు, గంపలగూడెం, మైలవరం, జి.కొండూరు, కంచికచర్ల, నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు నుంచి భారీగా జన సమీకరణ తలపెట్టారు. ఆర్టీసీ బస్సులను తెలంగాణ బీఆర్‌ఎస్ నాయకులే మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఖమ్మం వేదికగా జరిగే ఈ భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఎస్పీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితర నేతలు హాజరుకానున్నారు.. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. చరిత్రలో నిలిచిపోయేలా సభ విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు..