ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి సింహగిరి ప్రదక్షిణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కొండ చుట్టూ 32 కి.మీ.మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు 4 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. వారికి ఇబ్బంది కలగకుండా అధికారులు పలు చోట్ల మంచినీరు, మెడికల్ క్యాంపులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థాన ప్రచార రథం ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ సందర్భంగా సోమవారం నాడు ఆలయ అధికారులు సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు.
Read Also: Rains-Trains: వర్షాల ప్రభావం.. రేపటి వరకు పలు రైళ్ల రద్దు
భక్తులకు విద్యుత్, శానిటేషన్, మంచినీటి వసతి కల్పిస్తున్నామని సింహాచలం ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 32 కిలోమీటర్ల మేర 30 స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. 4వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించామని తెలిపారు. వర్షాలు పడుతున్న కారణంగా గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వెంట గొడుగు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. గిరి ప్రదక్షిణల సందర్భంగా సింహాచలం కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. 30 ఆర్టీసీ బస్సులను భక్తుల రాకపోకల కోసం కేటాయించామన్నారు. లుంబినీ పార్కు, తెన్నేటి పార్క్ సముద్రంలో స్నానాలు చేసే భక్తుల భద్రత కోసం గజఈతగాళ్లను నియమించామని పేర్కొన్నారు.
అటు అప్పుఘర్ సముద్రంలో భక్తులు స్నానాలు చేసే చోట మూడు ఎన్డీఆర్ఎఫ్, మెరైన్ పోలీసు బృందాలు విధుల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. జోడుగుళ్ల పాలెం సముద్రంలో ప్రమాదాలు జరుగుతున్నందున భక్తుల స్నానాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రెస్క్యూ కోసం బోట్లను అందుబాటులో ఉంచుతున్నామని.. గిరిప్రదక్షిణ ట్రాఫిక్, లా&ఆర్డర్ కోసం 2వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.