కరోనా సెకండ్ వేవ్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని.. అది కూడా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. దీనిపై సూచలనల కోసం.. పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.. పిల్లలకు కోవిడ్ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్ ప్రొటోకాల్స్ ఏ విధంగా ఉండాలి, చికిత్సపై వైద్యారోగ్య సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి తదితర అంశాలపై నివేదిక ఇవ్వనుంది టాస్క్‌ఫోర్స్ కమిటీ.. అయితే, థర్డ్ వేవ్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు పిడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి… పిల్లలే థర్డ్ వేవ్ బారిన ఎక్కువగా పడతారని చెప్పలేమన్న ఆయన.. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.. పిల్లలకు సంబంధించి వైద్య సదుపాయాల కల్పన కూడా దీనిలో భాగమే అన్నారు.. ఫిబ్రవరిలో నిర్వహించిన సీరో సర్వేలో పిల్లల్లో కూడా దాదాపుగా పెద్దలతో సమానంగా యాంటి బాడీస్ గమనించారని వెల్లడించిన చంద్రశేఖర్‌రెడ్డి.. మాస్క్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి అని స్పష్టం చేశారు.