APJAC Amaravati Chairman Bopparaju Venkateswarlu Comments After Meeting With CM Jagan: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే తాము ఉద్యమం చేశామని తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సీఎంకి చెప్పామన్నారు. 47 అంశాలపై సీఎస్‌కు తాము లేఖ ఇస్తే.. 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని అన్నారు. అన్ని అంశాలను కేబినెట్‌లోకి తీసుకొచ్చి పరిష్కరించినందుకు, సీఎంకు ధన్యవాదాలు తెలిపామన్నారు.
సోషల్ మీడియాలో ఉద్యోగ సంఘాలపై వ్యతిరేకంగా పలువురు రకరకాల చర్చ నడుపుతున్నారని.. ప్రభుత్వానికి ఉద్యోగులను దూరం చేసేందుకే రాజకీయ పార్టీలు ఈ చర్చ నడుపుతున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. 1-7-2018, 1-1-2019 డీఏలు రూ.734 కోట్లు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. సరెండర్ లీవులు, డీఏలు రెండూ కలిపి రూ.1800 కోట్లు బకాయిలను సెప్టెంబర్‌లోపు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఇస్తామన్న డీఏలు, పీఆర్సీ ఎరియర్లను.. ఏటా నాలుగు వాయిదాల్లో నాలుగేళ్లలో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. 2014 జూన్ 2 ముందు నుంచి పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ చేస్తామన్నారని తెలియజేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణలో తప్పుడు సమాచారాలను బయటకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిటీ వేసి, చర్చలు జరుపుతామని సీఎం చెప్పారని చెప్పారు.
Raviteja remuneration: హిట్లతో పనేంటి.. ‘తగ్గేదే’ లేదంటూ మళ్లీ పెంచేసిన రవితేజ!
జీపీఎస్ విధానంలో పాత ఫించన్ విధానానికి సమానంగా.. 50 శాతం పింఛన్, డీఆర్‌ను ఇస్తామన్నారని బొప్పరాజు వెల్లడించారు. పాత పింఛన్ విధానానికి దగ్గరగా జీపీఎస్ వచ్చినందున తాము సంతోషంగా ఉన్నామన్నారు. జీపీఎస్ అనేది 80 శాతం వరకు పాత పింఛన్ విధానానికి దగ్గరగా ఉందని.. జీపీఎస్ విధానంలో పీఆర్సీ ఎరియర్స్ ఒకటి వస్తే సరిపోతుందని, చట్టంలో పొందుపరచాలని కోరామని తెలిపారు. ప్రభుత్వం వాడుకున్న, ఉద్యోగులు దాచుకున్న జీపీఎస్ డబ్బును తిరిగి ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఆప్కాస్ కింద పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరగా.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను ఏపీజేఏసీ అమరావతి తీసుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగులకు సమస్యలు వస్తే.. ఏపీజేఏసీ అమరావతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.