ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఏపీలోని పులిచింతలకు 11 వేల 548 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.8 టీఎంసీల వద్ద ఉంది. కర్నూల్ జిల్లా హోస్పేటలో ఇవాళ తుంగభద్ర నది గేట్లు ఎత్తనున్నారు. ఈ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 87 వేల 305 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 16 వందల 49 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు. ప్రస్తుతం 1630.33 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఏంసీలు. ఇప్పుడు 95.314 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని జలాశయాన్ని వరద నింపుతోంది. ఆరు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తుండటంతో ప్రాజెక్టుకు భారీగా నీరు వస్తోంది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 400.30 అడుగులకు చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 8.4 టీఎంసీలు. అయితే ఇప్పుడు 6.30 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 12,000 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 10,000 క్యూసెక్కులు. డ్యాంలోని 2 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం 148 అడుగులు కాగా ప్రస్తుతం 145.20 అడుగుల వద్దకు నీరు చేరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 13.0873 టీఎంసీలు కాగా ఇప్పుడు 20.175 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 1,32,965 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,76,382 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువన గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కి వరద కొనసాగుతోంది. బ్యారేజ్ 81 గేట్లు ఎత్తారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానం(6,60,580 క్యూసెక్కులు)గా ఉండటం గమనార్హం.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు. ప్రస్తుతం 1394.45 అడుగుల వద్దకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 5750 క్కుసెక్కులుగా నమోదైంది. సింగీతం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 416.55 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీరు చేరింది. ఇన్ ఫ్లో 780 క్కుసెక్కులు, ఔట్ ఫ్లో 780 క్కుసెక్కులుగా ఉంది. పోచారం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1464 అడుగులు. ఇప్పుడు పూర్తిస్థాయిలో నిండింది. ఇన్ ఫ్లో 3330 క్కుసెక్కులు, ఔట్ ఫ్లో 3330 క్యూసెక్కలు అని అధికారులు తెలిపారు.
కల్యాణి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 409 అడుగులు. అయితే ప్రస్తుతం ఈ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఇన్ ఫ్లో 331 క్కుసెక్కులు, ఔట్ ఫ్లో 331 క్యూసెక్కులని అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది.
ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 693.600 అడుగులకు నీరు వచ్చింది. పూర్తి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలకు గాను 6.039 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 1,45,000 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 1,45,409 క్యూసెక్కులు. ఎడమ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 13 గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి పంపుతున్నారు.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 12.95 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 13.75 అడుగుల వద్ద ఉంది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లనూ పూర్తిగా ఎత్తివేశారు.