Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి పల్లా శ్రీనివాసరావు వెళ్లారు. గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడ పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
Read Also: Sai Dharam Tej: నటుడిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సాయి ధరంతేజ్.. స్పందించిన డిప్యూటీ సీఎం
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యం వల్లే మోడీ ఆశీస్సులతో ఏర్పాటైన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జన సైనికులు క్షేత్రస్థాయిలో చూపించిన రణత్సాహం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమిష్టి కృషి, భారతీయ జనతా పార్టీ అభిమానుల ఆదరణ సమిష్టిగా రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించిందని పవన్ కల్యాణ్ అన్నారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దాల కాలం పాటు ఈ మైత్రి కొనసాగేలా క్షేత్రస్థాయిలో చర్యలు ఉండాలని ఇరువురి నేతలు ఆకాంక్షించారు. దీనికి అనుగుణమైన కార్యాచరణను నిరంతరం తమ పర్యవేక్షణలో అనుసరించేలా చూడాలని నిర్ణయించారు. ఎక్కడైనా బేధాభిప్రాయాలు తలెత్తుతాయన్న సూచనలు కనిపించిన వెంటనే వాటిని సరిదిద్దే విధంగా మార్గదర్శకాలు ఇవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం ద్వారా గత పాలనలో జరిగిన అరాచకాన్ని ప్రజలు మరింతగా అవగతం చేసుకునేలా వ్యవహరించాలని పేర్కొన్నారు.