NTV Telugu Site icon

టీడీపీ, బాబు పనైపోయింది.. అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తే నేనూ రెడీ..!

Botsa

Botsa

ఆంధ్రప్రదేశ్‌లో వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చితికిలపడిపోయింది.. ఇక, ఈ ఎన్నికలతో టీడీపీ పని అయిపోయిందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎన్నికల ఫలితాలు లెక్కించాలని తీర్పు ఇచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆక్రోశం, ఆందోళన మొదలైందని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజలు సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందనన్నారు.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయింది.. టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదన్నారు. టీడీపీ విలువలు కాపాడు కోవాల్సిన పరిస్థితి ఉందన్న బొత్స… ఎన్నికల ఫలితాలతో ఇప్పటికైనా టీడీపీ బుద్ది తెచ్చుకోవాలని హితవుపలికారు.. ఎన్నికలు బహిష్కరణ అంటే నామినేషన్లకు ముందే ఆ విషయాన్ని తెలియజేయాలి.. కానీ, నామినేషన్లు వేశాక చేతకాక ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పారంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ.

ప్రజలిచ్చిన తీర్పు స్ఫూర్తితో ప్రజల సేవకు సీఎం జగన్ పునరంకితమవుతారు అని ప్రకటించారు మంత్రి బొత్స.. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా సీఎం జగన్ అమలు చేస్తారన్న ఆయన.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం సరైంది కాదన్నారు.. అయితే, అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయమనండి.. నేనూ రాజీనామా చేస్తాను.. ఇద్దరూ రాజీనామా చేసి పోటీ చేసి ప్రజాబలం ఏమిటో తేల్చుకుందాం అంటూ సవాల్‌ విసిరారు.. స్థాయిని తగ్గించేలా టీడీపీ నేతలు మాటలు మట్లాడవద్దన్న ఆయన.. టీడీపీ నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడిని చంపడానికి, కొట్టడానికే ఆయన ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారనడం సరికాదన్నారు. ఇక, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపిన మంత్రి బొత్స.. రాష్ట్రంలో 60 లక్షల మందికి ఇంటిపై శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని.. దీనికోసం విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారని.. డిసెంబర్ లోపు 80వేల టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందిస్తామని వెల్లడించారు.