వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం యొక్క రిజిస్ట్రేషన్ల ప్రక్రియ డిసెంబర్ 8వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నాం అని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకున్న వారికి డిసెంబర్ 21న సీఎం జగన్ డాక్యుమెంట్లను అందచేస్తారు. గత 30 ఏళ్ల నుంచి ఏపీ హౌసింగ్ కింద నిర్మాణాలు జరుగుతున్నాయి. 39 లక్షల ఇళ్లకు సంబంధించిన లబ్దిదారులు రుణం తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. వారి డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఆ ఇళ్లకు లబ్దిదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుణాలు చాలా కాలంగా పెండింగులో ఉన్నాయి. ఈ 39 లక్షల ఇళ్లకు సంబంధించి సుమారు రూ. 4 వేల కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల అప్పులు తీసుకోలేకపోతున్నారు.. అమ్ముకోలేకపోతున్నారు అని తెలిపారు.
అయితే డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల లబ్దిదారులకు ఎలాంటి హక్కు ఉండదు. ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకుంటే అన్ని రకాల హక్కులు వస్తాయి. రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇస్తారు.. రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేయడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాం. బీ-ఫాం పట్టాలున్నా.. అసైన్డ్ భూముల్లోని ఇళ్లకు కూడా 22-A లిస్టు నుంచి తప్పిస్తున్నాం. మరో 12 లక్షల మంది ప్రభుత్వ స్థలంలో సొంతంగా ఇళ్లు కట్టుకున్నారు.. వారికి కేవలం రూ. 10తోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఓటీఎస్ పథకం అనేది కంపల్సరీ కాదు.. స్వచ్ఛంధమే. ఓటీఎస్ పథకం వల్ల చాలా లాభాలున్నాయి. ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారికి స్కీమ్ ద్వారా వచ్చే సౌకర్యాలు పొందలేరు అని చెప్పిన ఆయన ఓటీఎస్ స్కీముకు దూరంగా ఉండే వారి డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్దే ఉంటాయి అని పేర్కొన్నారు.