కోనసీమ జిల్లా పేరు వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారిపోయింది.. ఆ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.. విధ్వంసం సృష్టించింది. మరోవైపు ఇవాళ కూడా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. ఇప్పటికే అమలాపురంలో కఠిన ఆంక్షలు విధించారు. బయట ప్రాంతాల నుంచి ఎవ్వరినీ అమలాపురంలోకి రానివ్వడంలేదు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు.. ఆర్టీసీ సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇక, కోనసీమకు సీనియర్ ఐపీఎస్‌లను పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Read Also: Dowry harassment: ముదివేడు ఎస్‌ఐపై కేసు నమోదు
అమలాపురంలో సున్నితమైన ప్రాంతాల్లో ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు.. జోన్లుగా విభజించి 144 సెక్షన్ అమలును పర్యవేక్షిస్తున్నారు ఐపీఎస్‌లు… అమలాపురంలో కీలకమైన క్లాక్ టవర్ దగ్గర నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు కృష్ణ జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్… ఏపీఎస్పీ, ఏఆర్ బలగాలతో పహారా నిర్వహిస్తున్నామని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. ఇక, ప్రస్తుతం అమలాపురం పట్టణంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ఇక, అమలాపురంలో ఎలాంటి వ్యాపారాలు తెరుచుకోలేదు.. మెడికల్, నిత్యావసరాలు తప్ప మిగిలిన షాపులు మూసివేశారు. ముమ్మిడివరం గేట్ సహా పట్టణంలో లావాదేవీలు బంద్ చేశారు.. పోలీసులు భరోసా ఇస్తున్నా షాపులు తెరిచేందుకు ధైర్యం చేయడం లేదు వ్యాపారులు.. మరోవైపు, అమలాపురం వీధుల్లో గస్తీ తిరుగుతున్నారు పోలీసులు.