AP Government Action On Chit Fund Fraud: చిట్‌ఫండ్ మోసాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా చిట్‌ఫండ్ కంపెనీల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా.. చిట్స్ ద్వారా డబ్బులు వసూలు చేసిన కొన్ని చిట్స్‌ఫండ్‌యేతర కార్యకలాపాలు బట్టబయలయ్యాయి. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతున్నట్టుగా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఒక కంపెనీ ద్వారా వసూలు చేసిన చిట్స్ డబ్బును.. అనుబంధ కంపెనీలకు మళ్లించినట్టు వెలుగులోకి వచ్చింది. రికార్డులు, ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని తేలింది. చిట్స్ పాడి, వాటి కాలం తీరిన తర్వాత కూడా.. చెల్లింపులు జరపని ఘటనలు ఉన్నట్టు అధికారులు పసిగట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడైంది.
చిట్స్ పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు.. ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరే రకంగా వాడుకుంటున్నారని తెలిసింది. కొన్ని చోట్ల ప్రత్యేక ఖాతాల్లో ఉంచిన డబ్బును, అదే రోజు వెనక్కి తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నారని.. నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నాయని అధికారులు తేల్చారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం.. ఆ డబ్బుకు సంబంధించి నగదు రసీదులు, వోచర్లు ఇవ్వకపోవడం వంటి అక్రమాలు చాలానే జరుగుతున్నాయి. జీఎస్టీ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో.. కొన్ని లావాదేవీలపై నేరుగా 100 శాతం ఆదాయపు శాఖ పెనాల్టీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎస్పీ మలికా గార్గ్ ఛిట్‌ఫండ్ మోసాల కేసులపై కట్టుదిట్టంగా దర్యాప్తు చేయాలని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో.. అధికారులు వేగం పెంచారు.