వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానని.. అయినా స్పందించలేదని పేర్కొన్నారు.. అయితే, వెంకటేశ్వరరావు లేఖకు కౌంటర్ ఇచ్చింది ఏపీ పోలీసులు శాఖ.. డీజీపీ, ఇతర పోలీసు అధికారుల పైనా.. వివేకా హత్య విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై స్పందించిన డీఐజీ పాల్ రాజు.. వివేకా హత్య కేసులో ఆధారాల్లేకున్నా.. జగన్ కుటుంబ సభ్యులు, బంధువులను అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారని.. కృత్రిమ డాక్యుమెంట్ల సృష్టిచారంటూ డీజీపీపై ఏబీ నిరాధార ఆరోపణలు చేశారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు.
నాడు వైఎస్ వివేకా హత్య దర్యాప్తు అంతా ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే జరిగిందన్నారు పాల్ రాజు.. ఏబీవీ ఇచ్చిన సమాచారంతోనే నాడు చంద్రబాబు ప్రతి రోజూ మీడియాతో మాట్లాడేవారన్న ఆయన.. తన వద్దనున్న కీలక సమాచారాన్ని నాడే ఏబీ వెంకటేశ్వరరావు సిట్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దర్యాప్తు విషయాన్ని పక్కన పెట్టి జగన్ కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్టు చేయాలని ఒత్తిడి తెచ్చారా..? లేదా..? అని ఎదురు ప్రశ్నించిన ఆయన.. నాడు దర్యాప్తు అధికారి రాహూల్ దేవ్ శర్మపై ఏబీవీ ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం కాదా..? అని నిలదీశారు.. రాహూల్ దేవ్ శర్మ నిబద్దత అధికారి కాబట్టి ఏబీవీ ఒత్తిళ్లకు తలొగ్గలేదని.. వివేకా హత్య కేసు విషయంలో తన వద్దనున్న దర్యాప్తు సమాచారాన్ని ఏబీవీ అందివ్వకపోవడం తప్పు కాదా..? అని మండిపడ్డారు. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలను మీడియాలో బయట పెట్టడం సమంజసం కాదని హితవుపలికిన డీఐజీ పాల్ రాజు.. కృత్రిమ డాక్యమెంట్లు సృష్టించారన్న ఏబీ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.. సహచర అధికారులపై ఏబీ ఆరోపణలు గుప్పించడం సరికాదని.. సర్వీస్ రూల్సుకు విరుద్ధంగా ఏబీవీ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. డీజీ హోదాలో ఉన్న ఏబీవీ ఈ తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు.