NTV Telugu Site icon

YS Jagan: ప్రధానికి వీడ్కోలు పలికిన ఏపీ సీఎం.. మోడీ చేతికి కోరికల చిట్టా…!

Ys Jagan

Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికిన సీఎం వైఎస్‌ జగన్‌.. అదే సమయంలో.. తమ ప్రభుత్వ కోరికల చిట్టాను ఆయన చేతిలో పెట్టారు.. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి వీడ్కోలు పలికిన ఏపీ సీఎం.. అక్కడే మోడీకి విజ్ఞాపన పత్రం అందజేశారు.. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి పలు కీలక అంశాలను ప్రధానికి అందజేసిన విజ్ఞాపన పత్రంలో ప్రస్తావించారు సీఎం జగన్.. రీసోర్సు గ్యాప్‌ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్‌ గ్యాప్‌ కింద గ్రాంటుగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని కోరారు సీఎం.. ఇక, తెలంగాణ డిస్కంలనుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు ఆంధ్ర ముఖ్యమంత్రి.

Read Also: Viral: నడి సముద్రంలో రెండు ముక్కలైన ఓడ… రెస్క్యూ ఆపరేషన్‌ వైరల్..

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్‌ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్‌ జగన్.. ఇక, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలని కోరారు.. ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని విన్నవించారు.. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తన వినతిపత్రంలో పేర్కొన్నారు సీఎం వైఎస్‌ జగన్. కాగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే.

Show comments