ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే జగన్ ఉండనున్నారు. ఈనెల 30న శనివారం జరగనున్న జ్యుడిషీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది.
అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో మరోసారి ప్రధాని మోదీని కలవనున్న నేపథ్యంలో ఆయన ఏ అంశాలు చర్చిస్తారన్న విషయం ఆసక్తి రేపుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక అంశాలను ఆయన చర్చిస్తారని ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గేర్ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నేతలకు జగన్ సూచించిన నేపథ్యంలో ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని విషయంలో ప్రధానంగా ప్రధాని మోదీతో జగన్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.