CM Jagan: ఏపీ సీఎం జగన్ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఈనెల 18న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, సబ్ స్టేషన్ నిర్మాణం వంటి ప్రాజెక్టులను సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నర్సాపురం బస్టాండ్, 100 పడకల ఆస్పత్రికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో కలెక్టర్ ప్రశాంతి మంగళవారం నాడు పర్యవేక్షించారు. సీఎం జగన్ టూర్ ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Read Also: History: భారతదేశ చరిత్రలో టాప్-10 పవర్‌ఫుల్ మహారాణులు
అటు నర్సాపురం పట్టణంలోని 25వ వార్డు వీవర్స్‌కాలనీలో బహిరంగసభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చినమామిడిపల్లి లేఅవుట్ వద్ద హెలీప్యాడ్ పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం మీదుగా వెళ్లే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిబ్బందికి పాస్‌లు జారీ చేయాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. అనంతరం ఆమె సీఎం పర్యటించనున్న ప్రాంతాలు బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, సభావేదిక స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ ప్రశాంతి వెంట జాయింట్ కలెక్టర్ మురళి, నరసాపురం సబ్‌కలెక్టర్ ఎం.సూర్యతేజ ఉన్నారు.