Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ వరుస పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈనెల 23న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 గంటల మధ్య నరసన్నపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.
Read Also: Rasna Founder passed away: ‘రస్నా’ వ్యవస్థాపక చైర్మన్ ఇక లేరు..
కాగా శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ రక్ష , భూహక్కు కార్యక్రమం లబ్దిదారులకు ఎంతో ప్రయోజనం కల్పిస్తుందని తెలిపారు. బ్రిటీష్ హయాంలో భూములకు సర్వే జరిపారని.. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేకపోయాయని వివరించారు. ప్రయోజనం పెద్దగా లేదనే ప్రభుత్వాలు రీ సర్వే జరపలేదని.. కానీ ఈ కార్యక్రమం భూతగాదాల నిర్మూలనకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామాలలో అశాంతికి కారణం భూ రికార్డులలో ఉన్న సమస్యేనని.. భూమి హక్కు , భూ రక్ష కార్యక్రమం వల్ల ప్రశాంత జీవనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడికి అవకాశం ఉంటుందని… పరిశ్రమలు, ఉద్యోగ కల్పన కూడా పరోక్షంగా జరుగుతాయన్నారు. రీ సర్వే వల్ల పేదప్రజల ఆస్తికి రక్షణ లభిస్తుందన్నారు. రైతులు ఈ సర్వేలో పాల్గొనాలని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. అటు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు సహా రెవెన్యూ వ్యవస్థలను సంస్కరిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలలో మార్పు చేసి గ్రామాలలోనే రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే ముటేషన్ ఆటోమేటిక్‌గా అయిపోతుందని పేర్కొన్నారు. టైటలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని దేశంలోనే మొదటిసారి తీసుకువస్తున్నామని మంత్రి ధర్మాన చెప్పారు.