ఏపీలో ఇప్పుడంతా జగన్ కేబినెట్లో చోటు దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేల గురించే హాట్ టాపిక్ అవుతోంది. పదవి రాలేదని అలిగిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి సీఎం జగన్, పార్టీ దూతలు మాట్లాడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడారు. కోటరీ వల్ల తనకు పదవి రాలేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఎన్టీవీతో ఏ విషయాలైతే మాట్లాడానో.. ఆ విషయాలన్నీ సీఎంకు వివరించాను.
https://ntvtelugu.com/yanamala-ramakrishnudu-sattires-on-jagan-cabinet/
పార్టీలో కోటరి చేస్తున్న పనుల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లాను. ఆ కోటరీ వ్యవహరంపై తానూ దృష్టి సారిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ప్రస్తుతమున్న సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి ఇవ్వలేకపోయినట్టు సీఎం వివరించారు. పార్టీ అవసరాల కోసం.. పార్టీ బలోపేతం కోసం పని చేస్తాను. 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిస్తేనే మాకు భవిష్యత్తు వుంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేస్తానన్నారు.
మంత్రి పదవి ఆశించాను.. రాకపోవడంతో కార్యకర్తలు బాధ పడ్డారు. మంత్రి పదవి రాకపోవడంతో కొంచెం బాధపడిన మాట వాస్తవం. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పార్టీ బలోపేతం చేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఏమంటాడో మాకు అనవసరం. చంద్రబాబు చంకలో దూరి పవన్ రాజకీయం చేయాలనుకుంటారు. జనసేన ఓ షేరింగ్ పార్టీ అన్నారు ఉదయభాను.
మరో ఎమ్మెల్యే పార్దసారధి మాట్లాడుతూ.. పార్టీ శ్రేయస్సు, సామాజిక సమీకరణాల దృష్ట్యా కెబినెట్ కూర్పు చేశామని సీఎం చెప్పారు. పార్టీ బాధ్యతలు అప్పజెబుతామని సీఎం చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం అన్నారు పార్థసారథి. ఇటు మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మంత్రి పదవిపై స్పందించారు. మంత్రాలయంలో నిర్వహించిన వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తమ కుటుంబంలో ఎవ్వరికి మంత్రిపదవి ఇవ్వాలో మీరేనిర్ణయించుకోండి అని సీఎం అడిగితే రెండేళ్ళపాటు వుండే మంత్రిపదవి కన్నా వెనుకబడిన మాప్రాంతాల అభివృద్దే లక్ష్యమని ముఖ్యమంత్రికి వివరించానన్నారు. మంత్రాలయం నియోజకవర్గానికి అవసరమైన లిఫ్ట్ ఇరిగేషన్, పలు అభివృద్ధి నివేదికను అందజేయగా స్పందించిన ముఖ్యమంత్రి వారంరోజుల వ్యవధిలోనే 5 లిఫ్ట్ఇరిగేషన్లు మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తాను మంత్రిగా వున్నట్లే అన్నారు. అనంతరం ప్రోత్సాహం కింద ఎంపికైన గ్రామవార్డు సచివాలయ వాలంటీర్లకు సేవారత్న, సేవమిత్ర పథకాలను అందజేసి, శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.