Site icon NTV Telugu

కేసీఆర్‌, జగన్‌ది మూడు ముక్కలాట.. రాత్రి ఫోన్లు.. పగలు ఉత్తరాలు..!

Somu Veerraju

Somu Veerraju

కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశం ముగిసింది.. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై చర్చించారు నేతలు.. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ, తెలంగాణ సీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు.. కేసీఆర్‌, జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారని కామెంట్‌ చేసిన ఆయన.. రాత్రి ఫోన్‌లో మాట్లాడుకుంటారు.. పగలు ఉత్తరాలు రాస్తారంటూ విమర్శించారు.. ఏపీ సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం రోజున కేసీఆర్‌ చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి.. ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి వివాదాలు ఉండవని, కృష్ణ జలాలను ఒప్పందం ప్రకారం పంచుకుంటామని కేసీఆర్‌ అన్నారని.. కానీ, ఆ మాటను కేసీఆర్‌ మర్చిపోయారా? గుర్తు చేయడానికి జగన్ సిగ్గుపడుతున్నారా..? అని ప్రశ్నించారు.

కృష్ణ జలాలపై సీఎం జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. తెలంగాణ విషయంలో మాట్లాడబోమని సజ్జల ఎందుకు అంటున్నారు? అని నిలదీసిన ఆయన.. విభజన సమయంలో ఏపీకి చాలా నష్టం జరిగింది.. రాజధాని నష్టపోయాం, భద్రచలం వదులుకున్నాం.. ఆదాయం కోల్పోయామన్నారు.. సోనియాగాంధీ కాళ్లు పట్టుకొని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలను కేసీఆర్‌ తెలంగాణలో కలుపుకున్నారన్న ఆయన.. ఏపీకి నష్టం జరుగుతున్నా జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు.. ఇక, ఏపీకి అన్యాయం జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోంది.. చుక్క నీరు వదులుకోమని ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. జగన్, కేసీఆర్‌ తెలివిగా ఉత్తరాలు రాసుకుంటున్నారని విమర్శించిన ఆయన.. కేఆర్‌ఎంబీ ముందు వాదనలు వినిపించకుండా మాట్లాడమంటే ఎలా…? అని ప్రశ్నించారు. మరోవైపు వివాదాలు లేని పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో వున్నాయి… అవి ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు.. ఏపీ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బీజేపీ ఉద్యమం చేస్తుందని.. త్వరలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు సోము వీర్రాజు.

Exit mobile version