NTV Telugu Site icon

Gadikota Srikanth Reddy: సీఎం పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చింది..

Gadikota Srikanth Reddy

Gadikota Srikanth Reddy

సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటనపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆరోపించారు. కొత్త జిల్లాకు సీఎం వరాలు కురిపిస్తారని ప్రజలు, రైతులు ఎదురు చూశారు.. ప్రజలకు, రైతులకు ఏ ఒక్క వరం ఇవ్వలేదని అన్నారు. సంపదను సృష్టించండి, అది ఏ రకంగానో నాకు చెప్పండి, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాత మీకు ఇస్తా అనడం చాలా దురదృష్టకరమని గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిని అడిగితే అడిగిన వారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేస్తున్నారు.. పెన్షన్లు పంపిణీ ఎంచుకొని పబ్లిక్ సిటీ కోసమే ప్రతి నెల 1వ తేదీన ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌లో వచ్చి ఇవ్వడం తప్పా.. ఎవరికి ఉపయోగకరంగా అక్కడ కనపడలేదని పేర్కొన్నారు.

Read Also: Crime: ప్రియుడి కోసం పారిపోయిన 13 ఏళ్ల బాలిక.. అమ్మాయిపై పోలీస్ అత్యాచారం..

బాబు దిగిపోయేటప్పటికి 43 లక్షలు పెన్షన్లు ఉంటే జగన్ ప్రభుత్వంలో 67 లక్షలు ఇచ్చామని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తాము ఏ రోజు కూడా ఇలా పబ్లిక్ సిటీ చేసుకోలేదు.. చంద్రబాబు ఐటీ నేనే చేశానంటూ ప్రచారం చేస్తున్నారు.. ఐటీ 2004లో చంద్రబాబు దిగిపోయేటప్పుడు దేశంలో హైదరాబాద్, బెంగళూరు మధ్య తేడా చూస్తే సాఫ్ట్‌వేర్ ఆదాయం నక్కకు, నాగ లోకానికి అంత తేడా ఉండేదని విమర్శించారు. వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్‌లో ఐటీ 10 శాతం అభివృద్ధి చెందింది.. నేనే ఐటీ రంగాన్ని తీసుకొచ్చాను అంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడని దుయ్యబట్టారు. ఇప్పటికీ నేనే హైదరాబాదును నిర్మించానంటూ ప్రచారం చేసుకుంటున్నాడని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సభలో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు పక్కన నిలబడి ఉన్నప్పుడు అక్కడున్న యువత కోసం తాను ఎంతో ఆశించానన్నారు. ఈ ప్రాంతం గురించి చెప్తారని అనుకున్నానని తెలిపారు. కానీ వారు మేమే టీడీపీ కోసం ఖర్చు చేశాం, మా గ్రామాలలో పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూర్చున్నామంటూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

Read Also: Childrens Missing: విశాఖలో కలకలం రేపుతున్న ముగ్గురు చిన్నారుల అదృశ్యం..

టీడీపీకి సంబంధించిన వ్యక్తులను అక్కడ పెట్టుకున్నట్లు కనిపించిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నా.. దయవుంచి ఆ యువత గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేయవద్దని చెప్పారు. సభలో ముఖ్యమంత్రి అవకాశం కల్పించినప్పుడు మంచి స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాల్సింది పోయి ఇలాంటి మాటలు చెప్పడం, దానికి తగ్గట్టుగా చంద్రబాబు ఐటీ టవర్‌ను మండల హెడ్‌క్వార్టర్‌లో కట్టేస్తాను అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. ఐటీపై ప్రచారం చేసుకుంటున్నావు.. వర్క్ ఫ్రం హోం కూడా తానే కనిపెట్టానని మభ్యపెట్టే మాటలు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజులలో గ్రామాలలో సచివాలయాలను నిర్మించి, డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి సంపద సృష్టించండి అని చెప్పడం ఏమిటి..? అని దుయ్యబట్టారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకుండా.. ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.