Lokayukta court: టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ భూ ఆక్రమణ ఆరోపణలపై లోకాయుక్త కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతంలో జరిగిన ఈ భూ కబ్జా వ్యవహారం తాజాగా అధికారిక నివేదికలు, ఆధారాలతో మరో కీలక మలుపు తిరిగింది.. 2016లో మదనపల్లెలో మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు నిర్ధారితమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై కూడా అనుమానాలు బలపడుతున్నాయి. బి.కె. పల్లి గ్రామంలో సర్వే నంబర్ 8/1 పరిధిలో ఉన్న 2.92 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని దొమ్మలపాటి రమేష్ ఆక్రమించినట్టు ఫిర్యాదు నిర్ధారణకు వచ్చింది. ఈ భూమి విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Read Also: US-Venezuelan: ట్రంప్ హెచ్చరికలు.. వెనిజులాలో భారీ పేలుళ్లు
మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి, ఆయన భార్య సరళ పేరున నకిలీ పట్టాదారుపత్రం ఆధారంగా ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. కలెక్టర్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూసాయి.. అప్పటి తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI), వీఆర్వో (VRO), వీఆర్ఏలు మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యారని కలెక్టర్ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు.. సెలవు రోజైన ఆదివారం నాడు అప్పటి తహశీల్దార్ శివరామిరెడ్డి రికార్డులు మార్చినట్టు కూడా రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా.. ప్రభుత్వం ఐదుగురు రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం కింద మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, ఆయన భార్యతో పాటు సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
ఈ వ్యవహారంపై లోకాయుక్త కోర్టు కూడా దృష్టిసారించడంతో.. డబ్బుల పందేలు, పేకాట, భూ కబ్జాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నేరుగా చర్యలు తీసుకునే అధికారాలు పొందారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇకపై చెరువు పోరంబోకు, ప్రభుత్వ కేటాయింపుల భూములు ఆక్రమిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కేసు భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడేవారికి గట్టి సంకేతంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.