Anil Kumar Yadav: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నందమూరి హీరోలు చేసిన ట్వీట్లపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఇప్పుడున్న టీడీపీ నారా వారి పార్టీగా మారిందని.. ఎన్టీఆర్ పేరు ఎత్తే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని వైఎస్ఆర్ తెచ్చారని.. ఆ పథకానికి వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌కు తాము ఎంతో గౌరవం ఇస్తున్నామని.. అన్నా క్యాంటీన్‌కు ఎన్టీఆర్ క్యాంటీన్ అని ఎందుకు పేరు పెట్టలేదని నిలదీశారు.
బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎందుకు ప్రయత్నించలేదని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నందమూరి హీరోలు ట్వీట్లు వేయడం కాదని.. టీడీపీని లాక్కోవాలని ఆయన సూచించారు. తొడలు కొట్టాలని.. ఊరికే సౌండ్లు చేయడం దేనికంటూ ప్రశ్నించారు. ఆ పార్టీ నందమూరి ఫ్యామిలీకి దూరం అవుతోందని.. దాని కోసం పోరాడాలని హితవు పలికారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు, ఎన్టీఆర్‌పై చెప్పులు వేసినప్పుడు ట్వీట్లు చేసిన నందమూరి హీరోలు బచ్చాగాళ్లు అని.. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలని సూచించారు. దేవుడి స్క్రిప్ట్ అని పప్పుగాడు మాట్లాడుతున్నాడని.. ఎన్టీఆర్ ఫోటో లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము ఉందా అంటూ లోకేష్‌కు అనిల్ కుమార్ యాదవ్ చురకలు అంటించారు.