Site icon NTV Telugu

APTF: ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ఏపీటీఎఫ్

Aptf

Aptf

APTF: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీలో ఈనెల 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ప్రకటించింది. ఏపీలో ఉపాధ్యాయుల‌ను అవ‌మానించేలా ప్రభుత్వం వ్యవ‌హ‌రిస్తోంద‌ని ఏపీటీఎఫ్ ఆరోపించింది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి అందే స‌న్మానాల‌ను కూడా తిర‌స్కరించాల‌ని నిర్ణయించినట్లు తెలిపింది.

Read Also: Tirumala Rush Down: ఏడుకొండలకు తగ్గిన రద్దీ.. కారణం అదేనా?

ఉపాధ్యాయులను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధిస్తోందని.. బైండోవర్ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని ఏపీటీఎఫ్ వెల్లడించింది. సొంత ఫోన్‌లలో ఫోటోలతో హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారని.. సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఏపీటీఎఫ్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డివైస్‌లు ఇచ్చేవరకూ ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌లో హాజరు నమోదు చేయబోమని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ మంజుల, కె.భానుమూర్తి స్పష్టం చేశారు. యాప్‌లో హాజరు నమోదుపై 15 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుందని చెప్పిన అధికారులు మాట మార్చారని.. మంత్రితో జరిగిన చర్చల్లో ప్రభుత్వమే డివైస్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశామన్నారు. అయినా సంఘాలన్నీ ఫోన్లలో హాజరు వేసేందుకు అంగీకరించాయన్నారు. అటు ఏపీటీఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి యునైటెడ్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్ (యూటీఎఫ్‌) కూడా మ‌ద్దతు తెలిపింది. సోమ‌వారం నాటి ఉపాధ్యాయ దినోత్సవాల‌కు హాజ‌రు కాకూడద‌ని త‌న స‌భ్యుల‌కు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.

Exit mobile version