భీమ్లా నాయక్ సినిమాను సీఎం వైఎస్ జగన్ తొక్కేశారు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడినాయన.. జగన్మోహన్ రెడ్డి శత్రువులు, మిత్రుల గురించి ఆలోచించరు.. ప్రజల గురించే ఆలోచిస్తారని తెలిపారు.. సినిమా పరిశ్రమలో సమస్యలకు చంద్రబాబే కారణం అని ఆరోపించిన ఆయన.. కోర్టుకు వెళ్లి అడ్డగోలుగా ఆదేశాలు తెచ్చుకుని ప్రజలను దోచుకున్నా చంద్రబాబు.. గుడ్డివాడుగా వ్యవహరించాడని మండిపడ్డారు. ఇక, భీమ్లా నాయక్‌ను జగన్ తొక్కేశారు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని.. ఫిబ్రవరి 25వ తేదీన జీవో ఇస్తున్నాం… సినిమా రిలీజ్ చేసుకోండి అని ప్రభుత్వం గానీ, వైసీపీ గానీ చెప్పలేదు కదా? అని ప్రశ్నించారు. న్యాయ పరమైన అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్న కొడాలి నాని.. ఈలోపు మా మంత్రి చనిపోవడంతో నాలుగు రోజులు ఆలస్యం అయ్యిందన్నారు.
Read Also: Purandeswari: అభివృద్ధిలో కాదు.. అప్పుల్లో ఏపీ నంబర్ వన్..
తల్లి లాంటి సినిమా పరిశ్రమను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్త చేశారు కొడాలి నాని.. సినిమా ఆడకపోతే పవన్ కల్యాణ్‌ను నష్టం ఉండదు.. పవన్‌కు తన రెమ్యునరేషన్ తనకు అందిందన్న ఆయన.. నర్సాపురం మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవిపైనే విమర్శలు చేశారని ఆరోపించారు. గతంలో చిరంజీవి సతీసమేతంగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిన విషయాన్ని పవన్ మర్చిపోయాడా? అని ప్రశ్నించిన కొడాలి నాని.. చిరంజీవిని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విషయాన్ని పవన్ మర్చిపోయారా? అంటూ మండిపడ్డారు. స్వయంగా చిరంజీవే భారతమ్మ తనను ఎంతో మర్యాదగా చూశారని చెప్పిన విషయం తెలియదా? అని నిలదీశారు. క్యాంపు కార్యాలయానికి స్వయంగా సీఎం వాహనమే వెళ్లదన్నారు కొడాలి.. సీఎం కూడా ఇంట్లో నుంచి నడుచుకుంటూనే క్యాంపు కార్యాలయానికి వెళ్తారన్న ఆయన.. అయినా చంద్రబాబు లాంటి వాళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి కొడాలి నాని.