Minister Narayana: న్యూ ఆర్టీసీ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన రావుతో కలిసి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఇక, మంత్రి నారాయణ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం ప్రతి నెలా తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఒక్కో నెల ఒక్కొక్క థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర కొరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.. గాలి కాలుష్యం వల్ల ప్రతి ఏటా ప్రపంచంలో 70 లక్షల మంది చనిపోతున్నారు అని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
Read Also: Keir Starmer Aadhaar: ఆధార్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు .. బ్రెట్ కార్డ్ నమూనాగా ఇండియన్ ఆధార్
ఇక, శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత రోగాలతో ప్రజలు అనారోగ్యానికి గురైతున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గాలి కాలుష్యం తగ్గింపునకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.. ప్రజా రవాణాను ప్రోత్సహించాలి, చెట్లను నాటడంతో పాటు సోలార్ విద్యుత్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సూపర్ జీఎస్టీలో సోలార్ విద్యుత్ పై జీఎస్టీ భారీగా తగ్గించారు.. సూపర్ జీఎస్టీ వల్ల రాష్ట్రానికి 8 వేల కోట్లు నష్టం జరుగుతున్నా.. ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్, పారిశుధ్యం, డ్రైనేజీలు, రోడ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది అన్నారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందిస్తామని పొంగూరు నారాయణ చెప్పుకొచ్చారు.