NTV Telugu Site icon

Andhra Pradesh: నాణ్యమైన విద్య వైపు మరో అడుగు..! ‘బైజూస్‌’తో ఒప్పందం

Byju's

Byju's

నాణ్యమైన విద్య దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ మరో ముందడుగు వేసింది.. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధంచేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.. అందులో భాగంగా అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం చేసుకుంది ఏపీ సర్కార్.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, బైజూస్‌ ప్రతినిధులు సంతకాలు చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం వేదికగా విద్యాశాఖ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఏపీ ప్రభుత్వం – బైజూస్‌ మధ్య ఎంవోయూ కుదిరింది.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బైజూస్‌ సీఈవో బైజు రవీంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ వైఖరేంటి..?

బైజూస్‌ ద్వారా ఎడ్యు–టెక్‌ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పేదపిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యింది ఏపీ ప్రభుత్వం.. ఏడాదికి రూ.20 వేలు నుంచి రూ. 24వేలు పైబడి చెల్లిస్తేకాని లభించని ‘బైజూస్‌’.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ ఉచితంగా అందుబాటులోకి రాబోతోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా తెలుగు – ఇంగ్లీష్‌ మీడియంలలో సమగ్రంగా నేర్చుకునే అవకాశాన్ని కల్పించబోతోంది. ఇక, దాదాపు 4.7 లక్షల మందికి ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తామని.. ఈ సెప్టెంబర్‌లోనే ట్యాబ్‌లు ఇస్తామని వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్.. ప్రతి ఏటా 8 వరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్న ఆయన.. వచ్చే ఏడాది నుంచి బైజూస్‌ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తామని వెల్లడించారు.. నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు పెట్టించనున్నట్టు పేర్కొన్నారు సీఎం వైఎస్‌ జగన్.

 

అంతేకాకుండా ఇవాళ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజని సీఎం జగన్‌ వ్యాఖ్యానించడం విశేషం.  అనంతరం బైజూస్ సీఈవో రవీంద్రన్ మాట్లాడుతూ.. యంగ్‌ స్టార్టప్‌ కన్నా ముఖ్యమంత్రి వేగంగా అడుగులు వేశారని బైజూస్‌  వ్యాఖ్యానించారు. మే 25న తొలి సమావేశం జరిగితే… వెనువెంటనే ఒప్పందం కుదుర్చుకున్నారని కితాబిచ్చారు. నమ్మశక్యం కానీ రీతిలో సీఎం జగన్ వేగంగా స్పందించారని, ముఖ్యమంత్రిగారి మార్గం మిగతావారికి అనుసరణీయమని రవీంద్రన్‌ అన్నారు.