Andhra Pradesh Liquor Licence: ఏపీలో బార్ల లైసెన్సులకు బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-2,3 పరిధిలోని బార్ల ఈ వేలం ప్రక్రియ ఇవాళ్టితో పూర్తయ్యింది. ఇవాళ నిర్వహించిన బార్ల బిడ్డింగ్ ద్వారా రూ. 339 కోట్ల మేర ఆదాయం సమకూరింది. శని, ఆదివారాల్లో బార్ల వేలం ద్వారా మొత్తంగా రూ. 597 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బార్లకు అధికారులు ఈ వేలం నిర్వహించారు. ఆదివారం నాడు 492 బార్లకు ఈ-ఆక్షన్ నిర్వహించగా.. రెండు బార్లకు బిడ్డింగ్ జరగలేదు. ఆదివారం రోజు బార్లకు నిర్వహించిన ఈ వేలంలో దర్శి, మార్కాపురంలో అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రూ. 1.40 కోట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా 840 బార్లకు గానూ 817 బార్లకు ఈ వేలం నిర్వహించారు. మిగిలిన 23 బార్లకు త్వరలో ఈ-ఆక్షన్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
Read Also: Chandrababu: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి.. సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు
కాగా జోన్-1, జోన్- 4 పరిధిలో బార్ల లైసెన్సులకు బిడ్డింగ్ శనివారం పూర్తయ్యింది. జోన్-1, జోన్-4లో నిర్వహించిన బిడ్డింగ్‌లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. కడప, తిరుపతి, ప్రొద్దుటూరుల్లో ఎక్కువ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. కడపలో అత్యధికంగా ఓ బార్‌కు రూ. 1.81 కోట్లకు బిడ్ దాఖలు కాగా తిరుపతిలో ఓ బార్‌కు రూ. 1.59 కోట్లు, ప్రొద్దుటూరులో ఓ బార్‌కు రూ. 1.30 కోట్లకు బిడ్లు దాఖలయ్యాయి. నెల్లిమర్లలో అత్యల్పంగా రూ. 17 లక్షలకు బిడ్ దాఖలైంది. ఇవాళ జోన్-2, జోన్-3కి నిర్వహించిన బిడ్డింగ్ లో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదారి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ పాలసీ అమలవుతుంది. కొత్త బార్ పాలసీ ప్రకారం 2025 వరకు ఏపీ ప్రభుత్వం లైసెన్సులు జారీ చేయనుంది.