BAC Meeting: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈరోజు ( సెప్టెంబర్ 18న) శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారు.
Read Also: AP Assembly: వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ మంత్రులు
అయితే, అసెంబ్లీలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. ఇవాళ జీఎస్టీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ లు తగ్గించడంతో ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ్టి సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. కేంద్రాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే, రేపు జలవనరుల శాఖపై చర్చ జరపనున్నారు. ఈ నెల 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ సిక్స్ పథకాలు, 26న క్వాంటం, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30వ తేదీన రాయలసీమ- కోస్తా- ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఇక, ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉన్నాయి. కాగా, ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్ లోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో చర్చించేందుకు 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది.
